నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..!
ఇజ్రాయెల్ మాటలు విని ఏకపక్షంగా ఇరాన్ పై దాడి మొదలుపెట్టిన అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు దాన్ని ఎలా ముగించాలో తెలియడం లేదు. ఇప్పటికే ఈ యుద్దంలో దారుణంగా దెబ్బతిన్న అమెరికా ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియక విలవిల్లాడుతోంది. యుద్ధం నుంచి బయటపడేందుకు రోజుకో దారి వెతుకుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గతంలో తాను చేసిన ఒక్కో డిమాండ్ ను ఇప్పుడు వదిలేస్తున్నారు.
ఇరాన్ ను తక్కువ అంచనా వేసి వార్ మొదలుపెట్టిన అమెరికా-ఇజ్రాయెల్ కు అక్కడ తగులుతున్న ఎదురుదెబ్బలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా అమెరికా మిత్రులైన గల్ఫ్ దేశాల్లో ఇరాన్ చేస్తున్న విధ్వంసం వారితో పాటు ట్రంప్ కూ నిద్రలేకుండా చేస్తోంది. అలాగని ఖర్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుని ఇరాన్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు, అలాగే భూతల దాడులతో ఇరాన్ ను ఆక్రమించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బలు తప్పట్లేదు. వీటన్నింటికీ మించి హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఉక్కు పిడికిలి నుంచి విడిపించే విషయంలో ట్రంప్ పిలుపును నాటో దేశాలే పట్టించుకోలేదు. దీంతో స్వయంగా ఆ పని చేసే పరిస్ధితి లేదని ట్రంప్ కు అర్ధమైంది.

ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా హార్ముజ్ తో సంబంధం లేకుండా యుద్ధం ముగించేందుకు సిద్దమయ్యారు. అంతకు ముందే పాకిస్తాన్ సాయంతో మధ్యవర్తిత్వం కోరినా ఇరాన్ పట్టించుకోలేదు. చివరికి తమతో డీల్ చేసుకోమని సున్నితంగా అడుగుతూ, హెచ్చరికలు కూడా చేస్తున్నా ఫలితం లేదు. దీంతో ఇప్పుడు హార్ముజ్ తెరిపించడమూ వద్దు, డీల్ కూడా వద్దు. రెండు, మూడు వారాల్లో ఇరాన్ నుంచి తప్పుకుంటామని ఇవాళ ట్రంప్ తేల్చేశారు. దీంతో ఇజ్రాయెల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఇరాన్‌పై అమెరికా తన సైనిక చర్యలను రెండు,మూడు వారాల్లో ముగించవచ్చని ట్రంప్ ఇవాళ ప్రకటించారు. అలాగే ఈ చర్యల ముగింపు ఇరాన్ తో చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రావడంపై ఆధారపడి ఉండకపోవచ్చని కూడా చెప్పేశారు. ఇరాన్ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇరాన్ అణు సామర్థ్యాలు తగినంతగా క్షీణించాయని నిర్ధారించుకున్న తర్వాత తాము వైదొలగవచ్చని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ట్రంప్ ఒట్టి చేతులతో ఇరాన్ వీడేందుకు సిద్దమవుతున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications