కరోనా తర్వాత మరో ముప్పు: వ్యాక్సిన్ తయారీలో భారత కంపెనీ కీలక అడుగు!!
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు ఆఫ్రికా దేశాలలో 'ఎబోలా' వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ మరింతగా విజృంభించి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించక ముందే దానికి అడ్డుకట్ట వేయడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధమైంది. ప్రస్తుతం ఎబోలా వ్యాప్తి చెందుతున్న వేగాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ ప్రమాదకరమైన వైరస్ నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు గాను, వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం 'సెపి' (CEPI - Coalition for Epidemic Preparedness Innovations) అనే అంతర్జాతీయ సంస్థ సుమారు 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.570 కోట్లు) భారీ నిధులను కేటాయించింది. ఈ నిధులను పొందిన సంస్థల్లో ఓ ప్రముఖ భారతీయ వ్యాక్సిన్ కంపెనీ కూడా ఉండటం విశేషం.
ప్రస్తుతం తూర్పు ఆఫ్రికా దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా ఎబోలాకు చెందిన కొత్త స్ట్రెయిన్ 'బుండిబుగ్యో' (Bundibugyo) అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రాణాంతకంగా మారింది. ఈ కొత్త స్ట్రెయిన్ కారణంగా ఇప్పటికే ఆఫ్రికాలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. కరోనా సమయంలో అండగా నిలిచినట్లుగానే, ఎబోలా సంక్షోభాన్ని కూడా ఎదుర్కొనేందుకు వీలుగా వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సెపి చీఫ్ రిచర్డ్ హాచెట్ శాస్త్రవేత్తలను, ఫార్మా సంస్థలను ఆదేశించారు.

ఈ కేటాయించిన 570 కోట్ల రూపాయల నిధులను ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పరిశోధనలు చేస్తున్న 3 ప్రధాన గ్రూపులకు పంచారు. ఇందులో అత్యధికంగా అమెరికాకు చెందిన మోడర్నా (Moderna) కంపెనీకి 50 మిలియన్ డాలర్లు కేటాయించారు. ఇక బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన భారతదేశానికి చెందిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' (SII) సంయుక్త పరిశోధనల కోసం 8.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన 3.2 మిలియన్ డాలర్ల నిధులను ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ సంస్థకు కేటాయించారు.
ఇండియాకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కలిసి 'ChAdOx1 Bundibugyo' అనే పేరుతో ఎబోలా వ్యాక్సిన్‌ను తయారు చేయబోతున్నాయి. గతంలో కరోనా మహమ్మారి సమయంలో భారతీయులకు రక్షణ కల్పించిన 'కోవిషీల్డ్' (ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్‌ను ఏ సాంకేతికత ఆధారంగా అయితే రూపొందించారో.. అదే అడెనోవైరస్ వెక్టర్ టెక్నాలజీతో ఈ ఎబోలా వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు ఐఏవీఐ సంస్థ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. గతంలో ఎబోలా 'జైర్' స్ట్రెయిన్‌ను అడ్డుకోవడంలో విజయవంతమైన మెర్క్ కంపెనీకి చెందిన 'ఇర్వెబో' వ్యాక్సిన్ టెక్నాలజీని వీరు ఉపయోగించనున్నారు.
ఎబోలా ముప్పు నుంచి మానవాళిని కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు కోట్లాది డాలర్ల ప్యాకేజీలతో ముందుకు వస్తున్నాయి. గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్ 'గావి' (Gavi) ఈ పోరాటం కోసం 50 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించగా.. వరల్డ్ బ్యాంక్‌కు చెందిన 'పాండమిక్ ఫండ్' ఏకంగా 220.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,840 కోట్లు) భారీ గ్రాంట్‌ను ప్రకటించింది. ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల సమన్వయంతో పాటు, భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభ, అంతర్జాతీయ నిధుల అండతో ఈ ప్రాణాంతక ఎబోలా మహమ్మారిని త్వరలోనే అదుపులోకి తీసుకురాగలమని వైద్య నిపుణులు బలంగా నమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications