ఆఫ్గన్‌లో సీక్రెట్ ఆపరేషన్: భారతీయుల తరలింపుకు రెండంచెల మిషన్-రెండు బ్యాచ్‌లు,14 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత్ అత్యంత పకడ్బందీగా,వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మంగళవారం(ఆగస్టు 17) 120 మంది భారతీయులను ఆఫ్గన్ నుంచి స్వదేశానికి చేర్చగా.. ఇందుకోసం భారీ కసరత్తే చేయాల్సి వచ్చింది. తాలిబన్లు అకస్మాత్తుగా రాత్రి కర్ఫ్యూ విధించడంతో అత్యంత చాకచక్యంగా రెండంచెల ప్రక్రియ ద్వారా ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. తాలిబన్లకు ఎక్కడా సమాచారం లీక్ అవకుండా అత్యంత గోప్యంగా మిషన్‌ను చేపట్టింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ కాబూల్‌పై మరింత సమాచారం మీకోసం...

ఆఫ్గన్ నుంచి భారత్‌కు చేరిన 120 మంది...

ఆఫ్గన్ నుంచి భారత్‌కు చేరిన 120 మంది...

మంగళవారం(ఆగస్టు 17) తెల్లవారుజామున కాబూల్ విమానాశ్రయం నుంచి 120 మంది భారతీయులను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో భారత్‌కు తరలించారు. వీరిలో సాధారణ పౌరులు,జర్నలిస్టులు,దౌత్యవేత్తలు,కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది,భద్రతా సిబ్బంది తదితరులు ఉన్నారు. అయితే ఈ 120 మందిని భారత్‌కు తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. తాలిబన్లకు సమాచారం లీక్ అవకుండా,వారికి చిక్కకుండా,ఒకవేళ చిక్కినా దాడుల నుంచి తప్పించుకునేలా ముందే కచ్చితమైన వ్యూహాలు రచించారు. అలా ఎట్టకేలకు ఆ 120 మందిని భారత్‌కు తీసుకొచ్చారు.

రెండంచెల మిషన్...

రెండంచెల మిషన్...

రెండంచెల ప్రక్రియ ద్వారా భారత్ ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. ఇందులో మొదటిది 'ఎయిర్‌పోర్టుకు చేరే మిషన్',రెండవది 'ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్‌కు'. అప్పటికే తాలిబన్లు ఆఫ్గనిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకోవడం,ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు నగరంలోకి చొరబడ్డారని వార్తలు వస్తుండటంతో అందరిలోనూ ఈ ఆపరేషన్‌పై టెన్షన్ నెలకొంది. మొదటి మిషన్ ప్రకారం... ఆగస్టు 16 రాత్రికి ఆఫ్గనిస్తాన్‌లోని భారతీయులంతా కాబూల్ విమానాశ్రయానికి చేరుకోవాలని,రాత్రంతా అక్కడే ఉండాలని భారత అధికారులు వారికి సమాచారమిచ్చారు. దీంతో అందరూ విమానాశ్రయానికి బయలుదేరారు. కానీ ఇంతలోనే తాలిబన్లు అకస్మాత్తుగా రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించారు.

అప్పటికప్పుడు ప్లాన్ మార్చేశారు...

అప్పటికప్పుడు ప్లాన్ మార్చేశారు...

తాలిబన్లు రాత్రి కర్ఫ్యూ ప్రకటించడంతో భారత అధికారులు అప్పటికప్పుడు ప్లాన్ మార్చేశారు.కాబూల్ విమానాశ్రయానికి బయలుదేరిన భారతీయులందరికీ ఫోన్లు చేశారు. విమానాశ్రయానికి కాకుండా నేరుగా భారత దౌత్య కార్యాలయానికి రావాలని సమాచారమిచ్చారు. అయితే ఆ మార్గంలో అడుగడగునా మోహరించిన తాలిబన్లు భారతీయులను దౌత్య కార్యాలయానికి అనుమతిస్తారా లేదా అనే టెన్షన్ పట్టుకుంది. అయితే డాక్యుమెంట్స్ చూపించడంతో వారిని అడ్డుకోలేదు. ఆ రాత్రికి ఆ 120 మంది భారతీయులంతా భారత దౌత్య కార్యాలయంలోనే నిద్రించారు.

రెండు బ్యాచ్‌లు... 14 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు...

రెండు బ్యాచ్‌లు... 14 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు...


మరుసటిరోజు తెల్లవారుజామున అందరినీ కాబూల్ విమానాశ్రయానికి తరలించాలనేది ప్లాన్. ఇందుకోసం 120 మందిని రెండు బ్యాచ్‌లుగా విభజించారు. 14 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఏర్పాటు చేశారు. అప్పటికే హక్కనీ నెట్‌వర్క్‌తో పాటు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాబూల్ నగరంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. దీంతో భారత అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
భారత దౌత్య కార్యాలయం నుంచి కాబూల్ విమానాశ్రయం వెళ్లే మార్గంలో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుని విమానాశ్రయం చేరుకోవడం అతిపెద్ద సవాల్. భారత కాన్వాయ్‌ ఒక్కో చెక్ పాయింట్‌ను దాటుతూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఢిల్లీలోని అధికారులకు చేరవేసింది. ఈ క్రమంలో ఒకటి,రెండు చోట్ల కాన్వాయ్‌ను ఆపినట్లు తెలుస్తోంది. మొత్తానికి కాన్వాయ్ కాబూల్ విమానాశ్రయాన్ని చేరుకోవడంతో మొదటి మిషన్ సక్సెస్ అయింది.

రాత్రంతా మేల్కొన్న ఢిల్లీ అధికారులు...

రాత్రంతా మేల్కొన్న ఢిల్లీ అధికారులు...

భారత దౌత్య కార్యాలయాన్ని వీడే ముందు.. కార్యాలయంలోని సెన్సిటివ్ డాక్యుమెంట్స్‌ను అధికారులు ధ్వంసం చేశారు. అటు భారత్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం(IAF) C-17 ఆ రాత్రికి దుషంబేలో ఆగింది. మరుసటిరోజు తెల్లవారుజామున ఎయిర్‌ట్రాఫిక్ క్లియరెన్స్ రాగానే కాబూల్‌కి టేకాఫ్ అయింది. కాబూల్‌లో ల్యాండ్ అయ్యాక... 120 మంది భారతీయులతో తిరిగి ఢిల్లీ బయలుదేరింది. పాకిస్తాన్,ఆఫ్గనిస్తాన్‌ ఎయిర్‌స్పేస్‌ నుంచి కాకుండా ఇరాన్ మీదుగా ఢిల్లీకి చేరింది. దీంతో రెండో మిషన్ కూడా విజయవంతమైంది. ఢిల్లీలో అధికారులు ఆ రాత్రంతా మేల్కొనే ఉన్నారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని,వివరాలను తెలుసుకుంటూనే ఉన్నారు. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్తున్న ఆయన... కాబూల్‌లో భారతీయుల తరలింపు పరిణామాలను పర్యవేక్షిస్తూనే ప్రయాణం సాగించారు.

ఇంకా ఆఫ్గన్‌లోనే వందలాది భారతీయులు...

ఇంకా ఆఫ్గన్‌లోనే వందలాది భారతీయులు...

సరైన సమయంలో,పక్కా ప్లాన్‌తో భారత్‌ ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. అయితే ఇప్పటికీ ఇంకా చాలామంది భారతీయులు ఆఫ్గనిస్తాన్‌లోనే చిక్కుకుపోయి ఉన్నట్లు భావిస్తున్నారు. ఎంతమంది ఉండవచ్చనే దానిపై క్లారిటీ లేనప్పటికీ... వారి సంఖ్య వందల్లోనే ఉండవచ్చునని తెలుస్తోంది. వారిని కూడా భారత్‌ తరలించే యోచనలో అధికారులు ఉన్నారు. వారితో పాటు ఆఫ్గనిస్తాన్‌లోని హిందు,సిక్కు ప్రజలను కూడా భారత్ తరలించవచ్చునని చెబుతున్నారు. చార్టెడ్ విమానాల ద్వారా వారిని వెనక్కి తీసుకొస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. ఇక కాబూల్‌లో భారత దౌత్య కార్యాలయం స్థానిక ఉద్యోగులతో ఇప్పటికీ కార్యకలాపాలు సాగిస్తోంది. వారికి భారత ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా వారికి వేతనాలు చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది.

ఆఫ్గన్‌లో మొదలైన తిరుగుబాటు

ఆఫ్గన్‌లో మొదలైన తిరుగుబాటు

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై తిరుగుబాటు మొదలైంది.తాలిబన్లను ఎదిరించలేక అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశాన్ని విడిచి పారిపోతే.. తదుపరి అధ్యక్షుడిని తానేనంటూ ముందుకొచ్చారు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ. దేశ అధ్యక్షుడిగా తనకు రాజ్యాంగం అవకాశం కల్పించిందంటూ ట్విట్టర్‌ ద్వారా ఆయన ప్రకటించుకున్నారు. తాను అష్రఫ్‌ ఘనీలా పిరికి పందను కాదని, దేశాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాలిబన్లపై పోరాడతామని అమ్రుల్లా ప్రకటించారు. తాలిబన్లతో జరిగిన పోరులో చారికర్‌ ప్రాంతాన్ని అఫ్గాన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. పంజ్‌షేర్‌ ప్రాంతాన్ని తమ ఆదుపులోకి తెచ్చుకునేందుకు ఆర్మీ పోరు సాగిస్తోంది. ఈ తిరుగుబాటుతో పాటు త్వరలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు అమ్రుల్లా ప్రయత్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+