అమెరికాలో అణుప్రమాదం.. ఒక్కసారిగా హైఅలర్ట్!
అగ్రరాజ్యం అమెరికాలో అణుప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న అమెరికా ఇంధన శాఖకు చెందిన కీలక అణు పరిశోధనా కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సవన్నా రివర్ నేషనల్ లాబొరేటరీ ప్రాంగణంలోని ఓ గదిలో సాయంత్రం 5.40 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అణుప్రమాదం సంభవించే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తం కావడంతో అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదం కారణంగా ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రైలు, నదీ, విమాన రవాణాను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) కూడా ఈ ప్రాంతంలో విమానాల రాకపోకలపై తాత్కాలక ఆంక్షలను విధించింది. లాబొరేటరీలోని ఏరియా ఏ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు దాదాపు 30 నిమిషాల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఓ ఉద్యోగికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో రేడియేషన్ బయటకు లీకయ్యిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నప్పటికీ.. ఎలాంటి రేడియోధార్మిక కాలుష్యం నమోదు కాలేదని ఇంధన శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. రాత్రి 9.45 గంటల సమయానికి పరిస్థితి పూర్తి అదుపులోకి రావడంతో ఎమర్జెన్సీ హెచ్చరికలను, ఆంక్షలను తొలగించారు.
1950లలో ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో నిర్మించిన ఈ సవన్నా రివర్ నేషనల్ లాబరేటరీ దాదాపు 310 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రారంభంలో అణు ఆయుధాల తయారీకి అవసరమైన ఫ్లుటోనియం, ట్రిటియం వంటి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి దీనిని వినియోగించేవారు. ప్రస్తుతం ఇది అణు వ్యర్థాల శుద్ధీకరణ, జాతీయ భద్రత, అణు సైన్స్ పరిశోధనలకు కీలక కేంద్రంగా కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
