'శత్రువుతో చేతులు కలిపేది ఎవరు?'-ఇజ్రాయెల్ లో విధి విచిత్రం..!
ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ కు జరిగిన తాజా ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ, విపక్ష నేత గాడీ ఐసెన్ కాట్ నేతృత్వంలోని యాషర్ పార్టీల కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్నికల తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అధికార, విపక్ష కూటములకూ తలో 50 ప్లస్ స్ధానాలు వస్తాయని అంచనా వేశాయి. ఇజ్రాయెల్ పార్లమెంట్ లోని 120 సీట్లలో 61 సీట్లు సాధిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికార, విపక్ష కూటములు రెండూ ఆ మార్క్ సాధించే పరిస్ధితి లేదు. అయితే విచిత్రంగా ఈ రెండు కూటములూ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా భావించే అరబ్ పార్టీలు 19 సీట్ల వరకూ గెల్చుకునే అవకాశం ఉంది. దీంతో ఇన్నాళ్లూ తాము వ్యతిరేకించిన అరబ్ పార్టీల మద్దతుతో వీరిలో ఒకరు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్ధితి.
ఒకప్పుడు పాలస్తీనా భూభాగంలో పాగా వేసిన యూదులు.. ఇజ్రాయెల్ (Israel) దేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దేశం విడిచి వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన పాలస్తీనా ప్రజలు తీవ్ర వివక్ష అనుభవించారు. అందులో నుంచి పుట్టుకొచ్చినవే అరబ్ పార్టీలు జాయింట్ లిస్ట్, రామ్. పాలస్తీనా, అరబ్ దేశాలపై సానుభూతితో ఉండే ఈ రెండు పార్టీలూ ఇజ్రాయెల్ కు వ్యతిరేకమని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ప్రధాన పార్టీలు ప్రజల్లో ప్రచారం చేసుకుంటూ వచ్చాయి. అయితే మారిన పరిస్ధితుల్లో ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఇప్పుడు అవే పార్టీలు కింగ్ మేకర్లుగా మారిపోయాయి. ఈ రెండు పార్టీల్లో ఒక దాని మద్దతు అయినా తీసుకుంటే తప్ప అధికార, విపక్షాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్ధితి లేదు. దీంతో ఈ అరబ్ పార్టీల మద్దతు తీసుకునేందుకు అధికార, విపక్ష కూటములు దారులు వెతుక్కుంటున్నాయి.

ఇజ్రాయెల్ లో గతంలో పోలిస్తే ఓటింగ్ శాతం భారీగా పెరిగి ఈసారి 77.7గా నమోదైంది. అలాగే యూదు ఓటర్లతో సమానంగా అరబ్ ఓటర్లు కూడా ఎన్నికల్లో ఓటేశారు. దీని ఫలితమే అరబ్ పార్టీలు కింగ్ మేకర్లుగా అవతరించడం, అధికార, విపక్షాలు మెజార్టీకి దూరంగా ఉండిపోవడం. దీంతో 17-19 సీట్లు గెల్చుకుంటున్న అరబ్ పార్టీలకు విపక్ష బ్లాక్ కు నేతృత్వం వహిస్తున్న మాజీ ఆర్మీ ఛీఫ్ ఐసెన్ కాట్.. పలు షరతులు పెట్టారు. ఇందులో ఇజ్రాయెల్‌ను యూదు, ప్రజాస్వామ్య రాజ్యంగా గుర్తించాలని, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య ప్రకటనలో పేర్కొన్న విలువలను అంగీకరించాలని, పాలస్తీనా పౌరులకు తప్పనిసరి సైనిక సేవను వర్తింపజేయడాన్ని అంగీకరించాలని, హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా స్పష్టంగా ఖండించాలని ఉంది. వీటికి అరబ్ పార్టీలు అంగీకరించే పరిస్దితి లేదు. దీంతో వీరిని వీటిలో కనీసం కొన్ని అంశాలకైనా ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగానే అరబ్ పార్టీలకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేసి ఓట్లు అడిగిన ప్రధాని నెతన్యాహు ఇప్పుడు వీరితో కలిసే పరిస్ధితి లేకపోవడం విపక్షానికి ఊరట.














Click it and Unblock the Notifications
