Flydubai: కో పైలట్ టెర్రర్ లింక్స్? బ్యాగ్ లో ఫ్రీ పాలస్తీనా పాంప్లెట్స్!
అంతర్జాతీయ విమానయాన చరిత్రలో కలకలం రేపిన దుబాయ్-టెల్ అవీవ్ 'ఫ్లైదుబాయ్' విమాన హైజాకింగ్, ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించిన విస్మయకర నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఈ విమానం ఇజ్రాయెల్ గగనతలానికి చేరుకుంటున్న సమయంలో ఊహించని విపత్తు ముంచుకొచ్చింది. విమానాన్ని నడుపుతున్న పైలట్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ ఒక్కసారిగా కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే కిందకు కూల్చివేసి, సామూహిక విధ్వంసానికి పాల్పడేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
కో-పైలట్ అకస్మాత్తుగా దాడికి పాల్పడటంతో కాక్‌పిట్‌లో తీవ్ర గందరగోళం చెలరేగింది. తీవ్ర గాయాలపాలైనప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దుండగుడితో తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే అప్పటికే దుండగుడు తన కాళ్లతో విమానంలోని కంట్రోల్ సిస్టమ్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో, విమానం కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 16,000 అడుగుల దిగువకు వేగంగా పడిపోయింది. ఈ ప్రమాదకర సమయంలో విమాన సిబ్బంది, కొందరు ధైర్యవంతులైన ప్రయాణికులు కాక్‌పిట్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారు. హెడ్‌ఫోన్ వైర్లు, ప్లాస్టిక్ కప్లర్లతో దుండగుడిని బంధించారు.

'ఫ్రీ పాలస్తీనా' కరపత్రాలు స్వాధీనం.. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు
ఈ దుశ్చర్యకు పాల్పడిన ఒమనీ కో-పైలట్‌కు సంబంధించిన లగేజీలో 'ఫ్రీ పాలస్తీనా' ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలు, తీవ్రమైన ప్రచార సామాగ్రి లభించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఇతను గతంలోనూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలంతో తీవ్రంగా ప్రభావితమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌తో ఎటువంటి దౌత్య సంబంధాలు లేని ఒమన్‌కు చెందిన వ్యక్తి, ఎలాంటి తనిఖీలను దాటుకుని ఈ కీలక మార్గంలో పైలట్‌గా ఉద్యోగం సంపాదించాడనేదానిపై ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాయి.
ప్రాణాలతో బయటపడిన 180 మంది.. సౌదీలో అత్యవసర ల్యాండింగ్
కాక్‌పిట్‌లో ఈ ప్రాణాంతక పోరాటం జరుగుతున్న సమయంలోనే విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. విమానంలోపల ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తూ భయంతో వణికిపోయారు. అయితే ప్రయాణికుల సకాల స్పందన, విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు నాన్-డ్యూటీ ఏవియేటర్ల సహాయంతో విమానాన్ని తిరిగి తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. అనంతరం సౌదీ అరేబియాలోని తబూక్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు . దీంతో 180 మంది ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు నిందితుడి అప్పగింత
ఈ విమాన ప్రమాదాన్ని తన ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకున్న కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను ప్రపంచ దేశాల నేతలు కొనియాడుతున్నారు. యూఏఈలోని భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను స్వయంగా పరామర్శించి, ఆయన చూపిన తెగువను ప్రశంసించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి సౌదీ అరేబియా అధికారులు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి యూఏఈ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కుట్ర వెనుక ఇరాన్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా అనే కోణంలో యూఏఈ, ఇజ్రాయెల్ సంయుక్త దర్యాప్తు బృందాలు తీవ్రంగా ఆరా తీస్తున్నాయి. ఈ ఘటన కారణంగా ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్ 'ఎల్ అల్' దుబాయ్ విమానాలను తాత్కాలికంగా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.














Click it and Unblock the Notifications
