విమానం గాల్లో ఉండగానే దూకేసిన ఇన్‌స్ట్రక్టర్.. నెక్స్ట్ ఏం జరిగిందంటే ??
అర్జెంటీనాలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. విమానం గాల్లో ఎగురుతుండగా సహ పైలట్‌గా ఉన్న ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ ఉన్నట్టుండి కిందకు దూకేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన శిక్షణలో ఉన్న విద్యార్థి, సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేశాడు. టొలెడో నగరంలో జరిగిన ఈ అసాధారణ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.
అర్జెంటీనాలోని స్థానిక ఫ్లయింగ్ ప్యారెట్ కార్డోబా ఫ్లయింగ్ స్కూల్‌కు చెందిన 42 ఏళ్ల లియాండ్రో ఆండ్రెస్ అనే సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ ఒక విద్యార్థికి విమాన ప్రయాణంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో విమానం గగనతలంలో ప్రయాణిస్తుండగా ఆయన అకస్మాత్తుగా తన సీట్‌బెల్ట్ విప్పేశారు. తన హెడ్‌సెట్‌ను కూడా పక్కనపెట్టి, ఎదురుగా ఉన్న విద్యార్థి వైపు చూస్తూ.. "నీకు ఏం చేయాలో తెలుసు, ఆ ప్రకారమే ముందుకు సాగు" అని చెప్పి క్షణాల వ్యవధిలోనే విమానం తలుపులు తెరిచి కిందకు దూకేశారు.

విద్యార్థి చాకచక్యం.. దర్యాప్తులో పోలీసులు
కళ్లముందే గురువు ప్రాణాలు తీసుకునేందుకు గాల్లోకి దూకేయడంతో ఆ విద్యార్థి ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. గగనతలంలో ఒంటరిగా మిగిలిపోయిన స్థితిలో తీవ్ర ఆందోళన చెందకుండా విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తాను నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించి అత్యంత చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా రన్‌వేపైకి ల్యాండ్ చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ అసాధారణ ధైర్యం అతడిని ప్రాణాపాయం నుంచి రక్షించింది.
ఈ తీవ్ర పరిణామంపై సదరు ఫ్లయింగ్ స్కూల్ డైరెక్టర్ ఎడ్వర్డో అల్వారెజ్ స్పందించారు. లియాండ్రో ఆండ్రెస్ ఎంతో అనుభవజ్ఞుడని, ఆయన ఇలాంటి ఘాతుకానికి ఒడిగడతాడని తాము అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా విమానం వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు గాల్లో తలుపులు తెరవడం చాలా కష్టమని వివరించారు. ఈ ఘటనకు కొద్దిగంటల క్రితమే ఆయన మరో విద్యార్థికి కూడా విజయవంతంగా శిక్షణ ఇచ్చారని, ఆ సమయంలో ఆయన ఎంతో సాధారణంగా కనిపించారని పేర్కొన్నారు.
స్థానిక పోలీసులు ఇన్‌స్ట్రక్టర్ లియాండ్రో ఆండ్రెస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అత్యంత అనుభవం ఉన్న పైలట్ గాల్లో ఉన్న విమానం నుంచి దూకడానికి దారితీసిన మానసిక పరిస్థితులు ఏమిటనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేసిన విద్యార్థిని రక్షక దళాలు అభినందించాయి.












Click it and Unblock the Notifications