Nepal : నేపాల్ సంక్షోభానికి తెర- తాత్కాలిక ప్రధానిగా సుశీల- పార్లమెంట్ రద్దు..!
నేపాల్ లో ఐదు రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెర పడేలా ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్ జడ్ నిరసనల కారణంగా దేశంలో తలెత్తిన సంక్షోభానికి తెరదించేందుకు నేపాల్ అధ్యక్షుడు, ఆర్మీఛీఫ్ కలిసి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో జెన్ -జడ్ నిరసనకారులు కోరుకున్న విధంగా దేశ మాజీ ఛీఫ్ జస్టిస్ సుశీలా కర్కీని తాత్కాలిక ప్రధానిగా ఎంచుకున్నారు. దీంతో ఆమె ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు.
ప్రధాని కేపీ శర్మ ఓలీ అవినీతి, బంధుప్రీతిపై ఆగ్రహంతో జెన్ జడ్ నిరసనకారులు సోషల్ మీడియాలో నిరసన తెలపడం, దీన్ని అణగదొక్కేందుకు సోషల్ యాప్స్ పై ప్రభుత్వం నిషేధం విధించడం, దీనిపై ఆగ్రహంతో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసేశారు. అనంతరం కొత్త ప్రధానిని ఎంచుకోవడంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.

చివరకు జెన్ -జడ్ నిరసనకారులు, అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్, ఆర్మీ ఛీఫ్ అశోక్ రాజ్ సిగ్జేల్ కలిసి ఉమ్మడిగా దేశ ఏకైక మహిళా ఛీఫ్ జస్టిస్ గా పనిచేసిన సుశీలా కర్కీని తాత్కాలిక ప్రధానిగా ఎంచుకున్నారు. అదే సమయంలో పార్లమెంట్ ను రద్దు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానిగా ఇవాళ రాత్రికి బాధ్యతలు స్వీకరించనున్న సుశీలా కర్కీ చిన్న కేబినెట్ ఏర్పాటు చేసుకుని ఈ రాత్రికే తొలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఇవాళ రాత్రికి జరిగే కేబినెట్ భేటీలోనే దేశ పార్లమెంట్ రద్దుతో పాటు 7 రాష్ట్ర అసెంబ్లీల రద్దుకు కూడా నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం దేశంలో పరిస్ధితుల్ని చక్కదిద్దిన తర్వాత కొత్త ప్రధాని, ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుశీలా కర్కీకి నిజాయితీపరురాలిగా, న్యాయకోవిదురాలిగా పేరుంది. ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపడితే నేపాల్ కు తొలి మహిళా ఛీఫ్ జస్టిస్ తో పాటు తొలి మహిళా ప్రధానిగా కూడా రికార్డుల్లోకి ఎక్కుతారు.












Click it and Unblock the Notifications