క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం ? పార్కిన్సన్స్ వ్యాధి అంటూ పుకార్లు-తాజా వీడియోలే ఆధారం
ప్రపంచదేశాలు వారిస్తున్నా వినకుండా ఉక్రెయిన్ పై దండయాత్రకు వెళ్లి ఎదురుదెబ్బలు తింటున్న రష్యాకు ఇప్పుడు మరో కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ యుద్ధానికి కారకుడైన రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ ఆరోగ్యంపై తాజాగా ఆనుమానాలు మొదలయ్యాయి. ఆయన పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని, కాస్మోటిక్ సర్జరీ కూడా చేయించుకున్నారనే ప్రచారాలు సాగుతున్నాయి. తాజా వీడియోలో ఆయన వణుకుతూ కనిపించడంతో పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తుందనే ప్రచారానికి ఊతం లభిస్తోంది.

వ్లాదిమీర్ పుతిన్ ఆరోగ్యం
ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన రష్యాను నిలబెట్టిన అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఉక్రెయిన్ పోరుకు ముందు వరకూ అంతర్జాతీయంగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ముఖ్యంగా రష్యాకు పటిష్ట నేతగా పేరు తెచ్చుకున్న పుతిన్ ను అమెరికా, పశ్చిమదేశాలు మినహా మిగిలిన దేశాలన్నీ గౌరవం ఇచ్చేవి. కానీ ఉక్రెయిన్ పై చేపట్టిన దండయాత్రపై ఆయన ప్రతిష్ట మనసబారింది. స్వదేశంలోనూ ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే సమయంలో పుతిన్ ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగుచూసిన వీడియోలు, ఫొటోలో ఇందుకు నిదర్శనం.
వణుకుతున్న పుతిన్
తాజాగా కనిపించిన వీడియోల్లో చర్చలు జరుపుతూ కూర్చున్న పుతిన్ వణుకుతున్నట్లు అర్ధమవుతోంది. తాను కూర్చున్న కుర్చీ ముందున్న టేబుల్ ను ఆయన పట్టుకుంటున్న తీరు గమనిస్తే పుతిన్ ఆరోగ్యం అంతకు ముందులా లేదనే విషయం అర్ధమవుతోంది. అదే సమయంలో ఆయన మొహం కూడా గతంతో పోలిస్తే బాగా మారిపోయింది. ఉబ్బినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, భారీ తేడానే కనిపిస్తోందన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు యుద్ధం మధ్యలో ఉన్న తరుణంలో ఆయన ఆరోగ్యంపై ఏ ప్రతికూల వార్త వచ్చినా అది రష్యాపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. అందుకే పుతిన్ ఆనారోగ్యాన్ని దాస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

పుతిన్ కు అసలు ఏమైంది ?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనకు అసలు ఏమైందన్న అంశాన్ని రష్యా ప్రభుత్వం కానీ, అధికార యంత్రాంగం కానీ బయటపెట్టడం లేదు. కానీ అనధికారికంగా సాగుతున్న ప్రచారం మేరకు ఆయన పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని, అలాగే ఆయన తాజాగా దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కాస్మొటిక్ సర్జరీ కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన గతంలోలా కాకుండా మొహమంతా ఉబ్బిపోయినట్లు మారి కొత్తగా కనిపిస్తున్నారని చెప్తున్నారు. ఎక్కువగా సమావేశాలు కూడా పెట్టుకోవడం లేదని, రెస్ట్ లోనే ఉంటున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీతో నేరుగా భేటీ అయ్యేందుకు కూడా పుతిన్ మొగ్గు చూపకపోవడం వెనుక కూడా ఇదే కారణమై ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications