Gaza Ceasefire: గాజాలో యుద్ధం ఆపుతున్న ఒక్క మగాడు ట్రంప్..! త్వరలో డీల్..!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య 2023 అక్టోబర్ లో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతే కాదు పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్ కు సైతం విస్తరించింది. ఇంత జరిగినా ఇజ్రాయెల్ తమ బందీల్ని హమాస్ చెర నుంచి విడిపించుకోలేకపోయింది. అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనా ఖైదీలు పొరుగు దేశాల జైళ్లలో మగ్గుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో పాలస్తీనాలోని గాజాలో కాల్పుల విరమణ కోసం కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి.
గాజాలో 15 నెలలుగా కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడం, మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బందీల విడుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. దోహాలో ఖతార్ మధ్యవర్తులు, సీనియర్ ఇజ్రాయెల్ అధికారుల మధ్య కొన్ని రోజులుగా జరిగిన చర్చల్లో పురోగతి లభించినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడింది. కతార్ అమీర్‌తో సమావేశం తర్వాత కాల్పుల విరమణ చర్చలు ముందుకు సాగుతున్నాయని హమాస్ ప్రతినిధి బృందం కూడా పేర్కొంది.

కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు హమాస్ ముగ్గురు బందీలను విడుదల చేయనుంది. తమ బందీల విడుదల తర్వాత ఇజ్రాయెల్ గాజాలోని జనావాసాల నుండి దళాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించనుంది. కాల్పుల విరమణ ఏడు రోజులు పూర్తయ్యాక మరో నలుగురు బందీలను హమాస్ విడుదల చేయనుంది. ఇజ్రాయెల్ దక్షిణ గాజా నుంచి గతంలో తరలివెళ్లిపోయిన స్థానికుల్ని తిరిగి ఉత్తరం వైపుకు రావడానికి అనుమతించనుంది. కానీ తీరప్రాంత రహదారి గుండా కాలినడకన మాత్రమే రావాల్సి ఉంటుంది. వాహనాలు, బండ్లు, ట్రక్కులు సలా అల్-దిన్ రోడ్ సమీపంలోని చెక్‌పాయింట్ ద్వారా దాటేందుకు అనుమతిస్తారు.
ఇజ్రాయెల్ దళాలు ఫిలడెల్ఫీ కారిడార్‌లో ఉంటాయి. తూర్పు, ఉత్తర సరిహద్దుల వెంబడి 800 మీటర్ల బఫర్ జోన్ ఉంచుతారు. అలాగే కాల్పుల విరమణ మొదటి దశ 42 రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో ఇజ్రాయెల్ వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించింది. ఇందులో 190 మంది 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్షలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ప్రతిగా హమాస్ 34 మంది బందీలను విడుదల చేస్తుంది. కాల్పుల విరమణ 16వ రోజు నుంచి రెండు, మూడో దశల చర్చలు ప్రారంభమవుతాయి.
ఇజ్రాయెల్-హమాస్ చర్చల్లో పురోగతికి కారణం అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలే. ఈ వారం లోపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే ఇరు పక్షాలు గతంలో ఎప్పుడూ చూడనంత దారుణంగా ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు వారాంతం లోపు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించే దిశగా అడుగులేస్తున్నాయి.












Click it and Unblock the Notifications