H-1B Visa ఫీజు పెంపు నుంచి వీరికి మినహాయింపు?
హెచ్ 1బీ వీసా వార్షిక ఫీజును 1,00,000 డాలర్ల పెంచిన తర్వాత.. కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐటీ రంగంలో కలకలం చెలరేగింది. మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి ఎమ్మెన్సీలు బయటి దేశాల్లో తమ ఉద్యోగులను హుటాహుటిన వెనక్కి పిలుపించుకున్నాయి.
ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజ సంస్థల్లో పని చేస్తోన్న ఉద్యోగులు కూడా ఇక స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఐటీ రంగం తీవ్ర ప్రభావానికి లోనైందిజ.
ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించింది. దీని తీవ్రతను తగ్గించింది. భారీ ఊరట ఇచ్చింది. పెంచిన లక్ష డాలర్ల ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారికి కాదని వైట్ హౌస్ వెల్లడించింది. హెచ్ 1బీ విసాపై ఇప్పటికే అమెరికాలో నివసిస్తోన్న వారికి లక్ష డాలర్ల ఫీజు వర్తించబోదని తేల్చి చెప్పింది. ఈ పెంపు కొత్త దరఖాస్తులకే మాత్రమేనని, ఇప్పటికే వీసా ఉన్నవారికి కాదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లివిట్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసింది వైట్ హౌస్. అమెరికాలో పనిచేస్తున్న డాక్టర్లను హెచ్- 1బీ వీసా ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వైట్‌హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్‌ను ఉటంకించింది. ఈ మినహాయింపునకు సంబంధించిన వివరాలు త్వరలో వెలువడనున్నాయి. దీనిపై గైడ్ లైన్స్ ను ఖరారు చేస్తోన్నామని టేలర్ రోజర్స్.. బ్లూమ్‌బెర్గ్ కు వివరించారు.
కేఎఫ్ఎఫ్ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం 76 మిలియన్ల మంది అమెరికన్లకు ప్రాథమిక వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉండట్లేదు. ఈ కొరతను తీర్చడానికి గతంలో పెద్ద సంఖ్యలో విదేశీ డాక్టర్లకు హెచ్-1బీ వీసాలను మంజూరు చేసింది. ఫలితంగా మారుమూల ప్రాంతాల్లో కూడా విదేశీ డాక్టర్ల సేవలు అందుబాటులో ఉంటోన్నాయి. తాజాగా వీటి ఫీజులు పెంచడం వల్ల విదేశీ డాక్టర్లెవరూ కూడా అమెరికాకు రాబోరని, వారికి ఇది భారంగా మారుతుందని వైట్ హౌస్ భావిస్తోంది.
ఈ విధానం అమెరికాలో డాక్టర్ల కొరతను మరింత పెంచుతుందని, దీని దుష్ప్రభావం మారుమూల ప్రాంతాల్లో అధికంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చింది. దీంతో కొత్తగా ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల వార్షిక ఫీజు నుంచి డాక్టర్లకు మినహాయింపు లభించే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలోనే వెలువడతాయని టేలర్ రోజర్స్ పేర్కొన్నారు. పెంచిన ఫీజుల వల్ల డాక్టర్ల అసోసియేషన్లు, ఆసుపత్రుల యజమానులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వైట్ హౌస్ ఈ స్పష్టత ఇచ్చింది.












Click it and Unblock the Notifications