వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తంత్ర యోగా పేరుతో శిష్యులపై గురువుల అత్యాచారాలు... శివానంద సెంటర్ గుట్టు బయటపెట్టిన బీబీసీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇష్లీన్ కౌర్‌

హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక వేధింపుల వివరణలు మిమ్మల్ని కలచి వేయవచ్చు.

బీబీసీ జర్నలిస్ట్ ఇష్లీన్ కౌర్ చాలాకాలంగా ఎంతో మక్కువతో శివానందలో యోగా టీచర్‌గా పని చేశారు. శివానంద ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ అందించే యోగా సంప్రదాయం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అయితే, శివానంద యోగా గురించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టు ఇష్లీన్ మనసును కలచివేసింది. దాని గురించి మరింత లోతుగా దర్యాప్తు చేయగా, ఆ సంస్థలో దశాబ్దాల తరబడి జరిగిన అనేక రకాల లైంగిక వేధింపుల కేసులు బయటపడ్డాయి. ఆ తరువాత ఆమె ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు.

నాకు పాతికేళ్లు వచ్చిన తరువాత యోగా గురించి తెలుసుకున్నాను. అప్పటి నుంచి అది నా జీవితంలో భాగమైపోయింది. యోగా అంటే నాకు ఆసనాలు, వ్యాయామం మాత్రమే కాదు. అదొక జీవన విధానంగా మారిపోయింది.

మా సమీపంలో ఉన్న శివానంద యోగా సెంటర్‌లో నేను శిక్షణ ఇవ్వడమే కాక అక్కడి వంటశాలలో వంట చేయడం, పరిసరాలు శుభ్రం చేయడం వంటి పనులన్నీ స్వచ్ఛందంగా చేసేదాన్ని.

శివానంద బోధనలు నా జీవితంలో ప్రతీ అంశాన్ని ప్రభావితం చేశాయి.

ఇదిలా సాగుతుండగా, 2019 డిసెంబర్‌లో మా శివానంద ఫేస్బుక్ గ్రూపులో ఒక పోస్ట్ కనిపించింది.

జూలీ సాల్టర్ అనే మహిళ శివానంద యోగా సంప్రదాయాన్ని ప్రారంభించిన స్వామి విష్ణుదేవానంద గురించి రాసిన పోస్ట్ అది.

కెనడాలోని శివానంద ప్రధాన కార్యాలయంలో విష్ణుదేవానంద ఆమెను మూడు సంవత్సరాలకు పైగా లైంగికంగా వేధించారని ఆ పోస్ట్ సారాంశం.

ఇది జరిగిన కొన్నేళ్ల తరువాత, ఆమె ధైర్యం కూడగట్టుకుని ఈ విషయం గురించి శివానంద మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమెకు అందరి నుంచీ మౌనమే ఎదురైంది.

ఆ తరువాత, శివానందలోని ఉన్నత స్థాయి గురువుల చేతుల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని ఆరోపణలు చేసిన 14 మంది మహిళలను నేను ఇంటర్వ్యూ చేశాను. వారెవరూ ఇన్నాళ్లూ తమ బాధలను బయటపెట్టలేదు సరి కదా, కనీసం తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పంచుకోలేదు.

తన సమస్యలను శివానంద బోర్డు పట్టించుకోలేదని మాజీ మహిళా సిబ్బంది ఒకరు చెప్పారు.

నేను ఒకప్పుడు ఎంతో ఇష్టంగా పనిచేసిన సంస్థలో అధికారాన్ని, పలుకుబడిని దుర్వినియోగం చేసినట్లు నా దర్యాప్తులో తేలింది.

ఇష్లీన్ కౌర్‌

శివానంద యోగాతో నా పరిచయం

2014లో కేరళలోని శివానంద ఆశ్రమంలో యోగా టీచర్‌గా శిక్షణ పొందాను. అక్కడ చేరిన మొదటి రోజు నాకు ఇంకా జ్ఞాపకమే. గోడ మీద విష్ణుదేవానంద పటం పెద్దది తగిలించి ఉంది.

ఆయన బోధనలు ఎంత శక్తిమంతమైనవి అంటే అనేకమంది యోగులు సంసార బంధాలన్నీ వదిలించుకుని ఈ సంస్థకు తమ జీవితాలను అంకితం చేశారు.

నేను నా జీవితంలో అత్యంత కష్ట కాలంలో ఉన్నప్పుడు శివానంద యోగా నాకు గొప్ప శాంతిని ప్రసాదించింది.

యోగాసనాలు నాకు శారీరక బలాన్ని సమకూర్చాయి. శివానంద కర్మ సూత్రాలు, సానుకూల దృక్పథం, ధ్యానం నాకు మనశ్శాంతిని, జ్ఞానాన్ని ప్రసాదించాయి.

2015లో నాకు పెళ్లైంది. అప్పుడు నా భర్త లండన్‌లో ఉన్నారు. పెళ్ళయ్యాక ఆయనతో పాటు లండన్ వెళ్లడానికి నేను కొంచం సంకోచించాను. అయితే, లండన్‌లో మా ఇంటికి దగ్గరగా పుట్నీలో శివానంద సెంటర్ ఉంది అని తెలిసాక హమ్మయ్య అనుకున్నా.

ఇష్లీన్ కౌర్‌

నాకు ఆ సెంటరే మొదటి భర్త అని నా భర్త ఆటపట్టిస్తూ ఉండేవారు.

జూలీ సాల్టర్ ఫేస్బుక్ పోస్ట్ రాసిన రెండు నెలల తరువాత, యూరోప్ నుంచి ఇద్దరు శివానంద బోర్డ్ మెంబర్స్ పుట్నీ సిబ్బందితో చర్చించడానికి ఇక్కడకు వచ్చారు.

అప్పటికే నా బుర్రలో తిరుగుతున్న అనేక ప్రశ్నలకు, సందేహాలకు వాళ్లు కొంతైనా జవాబిస్తారని ఆశించాను.

కానీ, వాళ్ల స్పందన చాలా అస్పష్టంగా, సందిగ్ధంగా ఉంది. ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్లు తమని తాము సమర్థించుకుంటున్నట్లు కనిపించారు.

ఇంక జూలీతోనే నేరుగా మాట్లాడాలని నిశ్చయించుకున్నాను.

Julie Salter

జూలీ శివానందలో చేరడం

న్యూజిలాండ్‌కు చెందిన జూలీకి 20 ఏళ్లున్నప్పుడు ఇజ్రాయెల్‌లో పర్యటిస్తుండగా శివానంద బోధనలు పరిచయం అయ్యాయి. తొందరగానే ఆమె శివానంద యోగా సంప్రదాయానికి ఆకర్షితులయ్యారు. 1978లో కెనడా వెళ్లి శివానంద ప్రధాన కార్యాలయంలో చేరి, అక్కడే స్థిరపడ్డారు.

అప్పట్లో విష్ణుదేవానంద అక్కడే ఉండేవారు. జూలీని ఆయనకు పర్సనల్ అసిస్టెంట్‌గా నియమించారు. ఆయనకు దగ్గరగా ఉంటూ సేవ చేసుకోవడం అదృష్టమని ఆమె మొదట్లో భావించారు.

అయితే, ఆమె దినచర్య చాలా కఠినంగా ఉండేది. వారంలో ఏడు రోజులూ తెల్లవారి 5.00 నుంచి అర్థరాత్రి వరకు ఏకధాటిగా పనిచేయాల్సి వచ్చేది. దీనికి జీతభత్యాలేవీ ఉండవు.

క్రమంగా, స్వామి విష్ణుదేవానంద ప్రవర్తన అర్థం కాకుండా ఉండేదని, తరచూ ఆమె మీద విరుచుకుపడేవారని జూలీ చెప్పారు.

తరువాత, పరిస్థితులు మరింత దిగజారాయి.

ఒకరోజు విష్ణుదేవానంద తన ఇంట్లో పైన గదిలో పడుకుని ఆధ్యాత్మిక ప్రవచనాలేవో వింటున్నారు. జూలీని కూడా తన పక్కన పడుకోమన్నారు.

జూలీకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు పడుకోమంటున్నారని అడిగారు.

అది "తంత్ర యోగా" అని ఆయన చెప్పారు. తంత్ర యోగా అనేది ఆధ్యాత్మిక శృంగారంతో ముడిపడిన యోగాభ్యాసం. అంటే శరీరం పూర్తి విశ్రాంతి పొందుతూ ఆధ్యాత్మిక భావనలకు చేరువ కావడం.

అయితే, అప్పటివరకూ దీన్ని విష్ణుదేవానంద సిద్ధాంతపరంగా మాత్రమే తన ఉపన్యాసాల్లో వివరిచారు.

"ఆరోజు నా బుద్ధి, మనసు కూడా వారిస్తున్నా వినకుండా ఆయన పక్కన పడుకున్నాను. ఇంక అప్పుడు శృంగార ప్రక్రియ జరిగింది. తరువాత నేను కిందకు వచ్చేసి నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ, బాధ, సిగ్గు, అపరాధభావం నన్ను తొలిచేశాయి."

ఇంక ఆ తరువాత మూడేళ్లకు పైగా వివిధ రకాల శృంగార ప్రక్రియల్లో పాల్గొనేలా ఆమెను బలత్కారం చేశారని జూలీ వివరించారు.

యోగాలో చెప్పే గురు శిష్య పరంపరలో శిష్యులు, గురువుకు పూర్తిగా పాదాక్రాంతం అయిపోవాలి. గురువు ఏం చెప్తే అది తూ.చ. తప్పక పాటించాలి. దేనికీ శిష్యుల సమ్మతి తీసుకోరు.

విష్ణుదేవానంద చేసినది అత్యాచారానికి తక్కువ కాదని జూలీ ఇప్పుడు భావిస్తున్నారు. గురు శిష్య పరంపరలో గురువుకు ఉండే అధికార బలానికి తాను బలైపోయానని జూలీ అన్నారు.

"నేను పూర్తిగా ఒంటరినైపోయాను. కుటుంబం నుంచి పూర్తిగా దూరమైపోయాను. ఆర్థికంగా ఆ సంస్థపై ఆధారపడి ఉన్నాను" అని ఆమె చెప్పారు.

జూలీ సాల్టర్

జూలీ ఫేస్బుక్ పోస్టుకు స్పందించిన మరో ఇద్దరు మహిళలు

జూలీ ఫేస్బుక్ పోస్టు చూసిన తరువాత, విష్ణుదేవానంద తమను కూడా లైంగికంగా వేధించారంటూ మరో ఇద్దరు మహిళలు పెదవి విప్పారు. వెంటనే వారిద్దరితో మాట్లాడాను.

1978లో లండన్‌లోని విండ్సర్ ప్యాలెస్‌లో జరిగిన ఒక వేడుక సందర్భంగా, తాను శవాసనంలో ఉండగా విష్ణుదేవానంద తనపై అత్యాచారం చేశారని పమేలా చెప్పారు.

యోగాలో శరీరానికి, మనసుకు పూర్తి విశ్రాంతి కలిగించేందుకు శవాసనం వేస్తారు.

కెనడాలోని ఆశ్రమంలో 1970ల మధ్యలో విష్ణుదేవానంద మూడుసార్లు తనపై అత్యాచారం చేశారని లూసిల్లే వెల్లడించారు.

మొదటి రెండుసార్లు అది తాంత్రిక యోగా అనుకొని భ్రమపడ్డానని, మూడోసారి ఆయన తనకు డబ్బులిచ్చేసరికి "తాను ఒక వేశ్యననే" భావన వచ్చిందని ఆమె తెలిపారు.

1993లో విష్ణుదేవానంద మరణించారు. కానీ, ఆ తరువాత మరో ఆరేళ్లకుగానీ జూలీకి ఆ సంస్థను వదిలిపెట్టే ధైర్యం రాలేదు.

ఇప్పుడైనా దీని గురించి మాట్లాడకపోతే ఇంకా ఎంతోమంది మహిళలు బలైపోతారని ఆమె భావిస్తున్నారు.

ఎందుకంటే, విష్ణుదేవానంద చనిపోయారుగానీ, ఆయన భక్తులు చేసే వేధింపులు అంతం కాలేదు.

జూలీ ఫేస్బుక్ పోస్టుతో శివానంద ఆగడాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు రాసాగాయి. ఇన్నాళ్లూ మౌనంగా భరించినవారందరూ ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు.

శివానంద గురువులపై వేధింపుల ఆరోపణలు

మరో ఇద్దరు శివానంద గురువులపై 11 మంది మహిళలు తీవ్ర ఆరోపణలు చేశారు. వారందరితోనూ నేను మాట్లాడాను. ఆ ఇద్దరిలో ఒకరు ఇంకా ఆ సంస్థలోనే పనిచేస్తున్నట్లు బీబీసీ భావిస్తోంది.

ఆ 11 మందిలో మేరీ (పేరు మార్చాం) చెప్పిన విషయాలు దిగ్భ్రాంతికి గురి చేశాయి.

మేరీని అనేక సంవత్సరాల పాటు శివానంద గురువుల్లో ఒకరు పెంచారు. చట్టపరమైన కారణాల వలన ఆయన పేరు బయటపెట్టలేం.

తనను పెంచి పెద్ద చేసిన వ్యక్తితో లైంగిక సంబంధం ఏర్పడేసరికి చాలా గందరగోళం కలిగిందని మేరీ చెప్పారు.

అయితే, ఆయన చెప్పింది చేయడం తప్ప తనకు మరో మార్గం లేకపోయింది.

ఒకానొక సమయంలో ఒక ఏడాది పాటు వారిద్దరి మధ్య లైంగిక సంబంధాలు నిలిచిపోయాయి. అయితే, ఒకరోజు చెప్పాపెట్టాకుండా ఆయన మేరీ గదిలోకి వచ్చి, ఏమీ మాట్లాడకుండా ఆమెతో సెక్స్ చేసి వెళిపోయారు.

ఈ వ్యక్తే తమను కూడా లైంగికంగా వేధించారని మరో అయిదుగురు మహిళలు కూడా ఆరోపించారు.

వీళ్లు ఒకరికొకరు తెలీదు. కానీ వాళ్లు చెప్పిన సంగతులు వింటుంటే ఒకే కరమైన పద్ధతి కనిపిస్తోంది.. కొన్నేళ్లపాటూ వీరిని పెంచి పెద్ద చేయడం, తరువాత లైంగిక దాడి.

1980లలో కాథరీన్ (పేరు మార్చాం)కు 12 ఏళ్లున్నప్పుడు కెనడాలో శివానంద పిల్లల క్యాంపుకు హాజరయ్యారు. అప్పుడే మొదటిసారి ఈ గురువు ఆమెపై శృంగారపరమైన కోరిక వెలిబుచ్చారు.

ఆ వ్యక్తి తనను తాకుతూ, కింద భాగాలను కూడా తడిమేవారని ఆమె చెప్పారు.

కాథరీన్‌కు 15 వచ్చేటప్పటికి, మరింత బాహాటంగా ఆమెను తాకడం ప్రారంభించారు. ఆమె తొడల మధ్య తాకడం, రొమ్ములు తడమడం ప్రారంభించారు.

17 ఏళ్ల వయసులో ఆమె నిద్రపోతుండగా, ఆ వ్యక్తి ఆమెపై లైంగికదాడి చేశారు. అదే రోజు ఆమె ఆ సంస్థను విడిచిపెట్టి బయటకు వచ్చేశారు.

అదే వ్యక్తి ఇటీవలే 2019లో తనపై లైంగిక దాడి చేశారని మరొక మహిళ ఫిర్యాదు చేశారు.

మేం ఆ వ్యక్తిని కలిసి ఈ ఆరోపణలకు జవాబివ్వమని అడిగాం. కానీ ఆయన స్పందించలేదు.

ఆయన ఇంకా ఇండియాలోని శివానంద సంస్థలో చురుకుగా పనిచేస్తున్నారని బీబీసీ అనుమానిస్తోంది. కానీ, అది నిజం కాదని ఆ సంస్థ చెబుతోంది.

లైంగిక దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న మరొక గురువు మౌరిజియో ఫినోచి. ఆయన్నే స్వామి మహదేవానంద అని కూడా పిలుస్తారు.

మహదేవానందకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన ఎనిమిది మంది మహిళలతో నేను మాట్లాడాను.

వారిలో ఒకరు వెండీ, మహదేవానంద పర్సనల్ అసిస్టంట్‌గా కెనడా ప్రధాన కార్యాలయంలో 2006లో పనిచేశారు.

ఈమెయిల్స్ ప్రింట్ చేసి ఆయన క్యాబిన్‌లో అందించడం ఆమె విధుల్లో ఒకటి.

ఒకరోజు ఈమెయిల్స్, బ్రేక్‌ఫాస్ట్ రెండూ తన పడకగదిలోకి తీసుకురమ్మని ఆమెకు చెప్పారు. అక్కడ ఆయన తన మంచంపై కూర్చుని ఉన్నారు.

"ఆయనకు పళ్లెం అందిస్తుండగా నా చేయి పట్టుకు లాగి దుప్పటి తొలగించారు. దుప్పటి కింద ఆయన హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నారు. వీర్యాన్ని నా చేతిలో వదిలారు. ఆ క్షణంలో నన్ను ఓ మనిషిగా ఆయన పరిగణించట్లేదని అర్థమైంది. ఆయన వరకు నేనొక సాధనం కింద లెక్క" అని వెండీ చెప్పారు.

ఈ అవమానాల గురించి సీనియర్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఇదంతా "గురు కృప" అంటూ దాన్ని ఆధ్యాత్మిక చట్రంలో బిగించే ప్రయత్నం చేస్తారని ఆమె అన్నారు.

"అంటే ఇలా చేయడం ద్వారా గురువులు మనకు పాఠం బోధిస్తున్నారని వారి ఉద్దేశం."

మేము మహదేవానందను కలిసి ఈ ఆరోపణలపై స్పందించమని అడిగాం. కానీ, మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

సెప్టెంబరు 1971లో బెల్ ఫాస్ట్ లో పీటర్ సెల్లర్స్ , స్వామి విష్ణు దేవానంద

ప్రోజెక్ట్ 'సత్య'

శివానంద ఫేస్బుక్ గ్రూపులోని సభ్యులందరూ కలిసి 'సత్య' అనే ప్రోజెక్ట్ ప్రారంభించాం. మేమందరం చందాలు వేసుకుని ఒక లాయరును నియమించుకున్నాం.

మహదేవానంద మా లాయర్‌కు ఒక ఈమెయిల్ పంపించారు. దాన్నీ బీబీసీ పరిశీలించింది.

తన "దుశ్చర్యలకు" క్షమాపణలు కోరుతూ, మళ్లీ ఇటువంటివి "పునరావృతం కాకుండా" చూసుకుంటానని ఆ ఈమెయిల్‌లో రాశారు.

శివానంద మేనేజ్‌మెంట్‌కు ఇవన్నీ తెలుసా?

ఈ విషయాలన్నీ శివానంద మేనేజ్‌మెంట్‌కు ఎంతవరకు తెలుసనే అనుమానం వచ్చింది.

2003లో జూలీ శివానంద ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ బోర్డ్ (ఈబీఎం)కు తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. విష్ణుదేవానంద చనిపోయిన తరువాత శివానంద సంస్థను నడిపించడానికి ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డును ఏర్పాటు చేశారు.

స్వామి మహదేవానంద ఆ బోర్డు సభ్యుల్లో ఒకరని జూలీ చెప్పారు.

"ఆయనకు ఈ విషయాలన్నీ చాలాకాలం నుంచి తెలుసని అంగీకరించారు."

అయితే, స్వామి మహదేవానందపై కూడా లైంగిక వేధింపుల ఫిర్యాదులు ఉన్నాయని జూలీకి అప్పుడు తెలీదు.

తరువాత, ఆమె మరో నలుగురు బోర్డు సభ్యులకు కూడా తనపై జరిగిన దాడి గురించి తెలిపారు.

అయితే, జూలీ 2003లో ఈ విషయాలేవీ తమతో చర్చించలేదని ట్రస్టీలు దాటవేశారు.

కాగా, ఆ సమయంలో జూలీ తనను కలిశారని మహదేవానంద తన ఈమెయిల్‌లో అంగీకరించారు. తరువాత ఆ విషయాల గురించి అందరికీ తెలిసిపోయిందని కూడా చెప్పారు.

2006లో మళ్లీ జూలీ ఈబీఎంతో సమావేశమయ్యారు. ఆ సమయంలో కూడా తనపై జరిగిన లైంగిక దాడి ప్రస్తావన తీసుకువచ్చారు.

ఆ చర్చల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఇరు పక్షాలు వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేశాయని ట్రస్టీలు చెబుతున్నారు. కానీ, వారు చేస్తానన్నవేవీ చేయలేదని జూలీ అంటున్నారు.

ఆ తరువాతి సంవత్సరం జూలీ తరపు న్యాయవాది నష్టపరిహారం కోరుతూ బోర్డుకు మరో లేఖ రాశారు.

దీనికి సమాధానమిస్తూ, ఎప్పుడో జరిగిన విషయాల గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని ఈబీఎం తరపు న్యాయవాది లేఖ రాశారు.

జూలీతో మాట్లాడిన తరువాత, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, లైంగిక వేధింపులు జరిపితే వెంటనే ఫిర్యాదు చేయగలిగేలా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించామని శివానంద చెబుతోంది.

ఫిర్యాదుల తరువాత కూడా ఆ గురువులను ఇంకా ఎందుకు గౌరవిస్తున్నారని మేం శివానందను ప్రశ్నించాం.

"శివానంద తమ గురు పరంపరను, వారి బోధనలను గౌరవిస్తుందని" వారు జవాబిచ్చారు.

మహదేవానంద గురించి బోర్డుకు ఎప్పటినుంచో తెలుసు

మహదేవానంద చర్యల గురించి 1999 లోనే బోర్డుకు తెలుసని మా దర్యాప్తులో తేలింది.

అప్పట్లో ఈబీఎంలో ఉన్న స్వామి శారదానంద (అమెరికన్ మహిళ)కు 1998-99లో దిల్లీ ఆశ్రమం డైరెక్టర్ ఫోన్ చేసి మహదేవానంద ప్యాంటు వేసుకోకుండా తిరుగుతున్నారని ఏడుస్తూ చెప్పారు.

అయితే, ఆయన అండర్‌వేర్‌తో తిరుగుతున్నారని శారదానంద అపార్థం చేసుకున్నారు. మహదేవానందకు ఫోన్ చేసి అడిగితే, అండర్‌వేరు కాదు కదా, నడుం కింద దుస్తులేవీ ధరించట్లేదని ఆయన ఒప్పుకున్నారు.

"అంతే కాకుండా, దిల్లీ డైరెక్టర్ తన ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా మహదేవానంద వెళ్లి ఆమె ముందే హస్తప్రయోగం చేసుకున్నట్లు కూడా ఆయన నాతో చెప్పారు" అని ఆమె వివరించారు.

దాంతో, చాలా ఆందోళనకు గురైన శారదానంద తరువాతి ఈబీఎం మీటింగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

"ఇదంతా నిజమే. ఇలాంటివి చెయ్యొద్దు అంటే మానేస్తాను, ఇందులో పెద్ద సమస్యేముంది" అన్నట్లు మహదేవానంద మాట్లాడారని శారదానంద చెప్పారు.

ఇంక ఇలాంటివి చేయనని ఆయనే ఒప్పుకున్నారు కాబట్టి ఇక చేసేదేం లేదన్నట్లు బోర్డు స్పందించింది.

తరువాత కొన్ని నెలలకు శారదానందను బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు లేఖ వచ్చింది.

ఈ విషయం గురించి కూడా మేము ఈబీఎంను అడిగాం. కానీ, వాళ్లేమీ జవాబివ్వలేదు.

దీన్నిబట్టి లైంగిక వేధింపుల విషయాలన్నీ బోర్డుకు, సీనియర్ సిబ్బందికి ముందే తెలుసని అర్థమవుతోంది.

అందుకే 2006లో వెండీ పైఅధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్లు "మళ్లీనా?" అన్నట్లు చూశారు.

స్వామి మహదేవానందకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని కాథరీన్‌కు చెప్పారు.

"కెనడాలో ఇలాంటి చర్యలను లైంగిక దాడిగా పరిగణిస్తారని, నేను పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని ఆ సమయంలో నాకు తెలియలేదు" అని కాథరీన్ అన్నారు.

ఇది జరిగిన పదమూడేళ్ల తరువాత ఈబీఎం మహదేవానందపై దర్యాప్తు జరిపి, ఆయన రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది.

శివానంద సిబ్బందిపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసిన 25-30 మంది మహిళలతో తాను మాట్లాడానని వారంతా నిజమే చెప్తున్నట్లు తేలిందని ప్రోజెక్ట్ సత్య తరపు లాయర్ కరోల్ మర్చాసిన్ చెప్పారు.

కాథరీన్ ఫిర్యాదు చేసిన తరువాత పోలీసులకు ఎందుకు చెప్పలేదని మర్చాసిన్ బోర్డు సభ్యులను అడిగారు.

సాక్ష్యాలు లేకుండా ఇవన్నీ చెల్లవని బోర్డు జవాబిచ్చింది.

అయితే, ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తిని విధుల నుంచి తొలగించినట్లు ఈబీఎం తెలిపింది.

కానీ, ఆయన ఇంకా ఇండియాలోని ఆశ్రమాల్లో క్రియాశీలకంగా ఉన్నట్లు మాకు సమాచారం అందింది.

కేరళ ఆశ్రమానికి ఫోన్ చేసి కనుక్కుంటే, ఈ ఏడాది ప్రారంభంలో ఆయన అక్కడ ఒక కోర్సు మొత్తం బోధించారని తెలిసింది.

ఈబీఎంను ఇంటర్వ్యూ చేసేందుకు వారు అంగీకరించలేదు. కానీ మాకు ఒక లేఖ పంపించారు.

"బీబీసీ దర్యాప్తులో బయటపడిన అధికార దుర్వినియోగాన్ని, అనుచిత ప్రవర్తనను ఈబీఎం ఖండిస్తోంది. బాధితులకు పూర్తి సానుభూతి తెలుపుతోంది. గతంలో చేసిన ఆరోపణలను పరిష్కరించడంలో తప్పులు జరిగి ఉంటే క్షమించమని కోరుతోంది.

దీనిపై స్వతంత్ర్య దర్యాప్తును శివానంద ఏర్పాటు చేసింది. సంస్థ పాలసీలను పరిశీలించేందుకు, భద్రతకు సంబంధించిన విధానాలను సమీక్షించేందుకు న్యాయ నిపుణులను నియమించింది.

ఇకపై ఇలాంటి వేధింపులు జరిగితే స్వేచ్ఛగా ఫిర్యాదు చేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. సభ్యులు అందరికీ పూర్తి శారీరక, మానసిక ఆరోగ్యం చేకూర్చాలనే తపనతో శివానంద పనిచేస్తోంది" అని ఆ ప్రకటనలో తెలిపారు.

'ఇక శివానందకు స్వస్తి '

ఏప్రిల్‌లో నేను పుట్నీ ఆశ్రమానికి వెళ్లాను. గత ఐదేళ్లుగా నేను అక్కడే యోగా టీచరుగా పనిచేశాను. కానీ, ఈసారి నేను లోపలికి వెళ్లలేదు.

అక్కడ ఏం జరుగుతుందో గ్రహించలేకపోవడం చాలా సులువని, జరుగుతున్న విషయాలను ప్రశ్నించడం కష్టమని నేను మాట్లాడిన మహిళలంతా చెప్పారు.

మా దర్యాప్తులో మాట్లాడిన మహిళలందరూ పశ్చిమ దేశాల వాసులే.

అయితే, భారతీయ మహిళలు కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నారని, కానీ వాటి గురించి నోరు విప్పడానికి బాగా భయపడుతున్నారని తెలిసింది.

కొంతమంది భారత మహిళలు ఈమెయిల్స్‌లో తమకు జరిగిన పరాభవాలను వివరించారు.

నా వరకు ఇంక శివానంద చాప్టర్ ముగిసినట్టే.

ప్రొడ్యూసర్: లూయీ ఆడమో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

English summary
Guru rapes students in the name of Tantra Yoga
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X