"మేం మీలా కాదు.. మా దేశంలోకి ఎవరైనా రావచ్చు"
H-1B వీసా దరఖాస్తు ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై H-1B వీసా అప్లికేషన్ ఫీజు లక్ష డాలర్లు (దాదాపు రూ. 88 లక్షలు) వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ ఫీజు కేవలం రూ. ఒక లక్ష నుంచి రూ.6 లక్షల మధ్య మాత్రమే ఉండేది.
అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా లక్షలాది మంది విదేశీ నిపుణులు, అలాగే H-1B వీసాపై ఎక్కువగా ఆధారపడిన ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర రంగాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలోని టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున విదేశీ ఉద్యోగుల ప్రతిభను వినియోగించుకుంటున్నాయి. అయితే తాజాగా వీసా ఫీజు పెంపు కారణంగా వారి వ్యయాలు పెరిగి, నియామకాల్లో పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా ఘాటుగా స్పందించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి గువో జియకన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రాస్- బార్డర్ టాలెంట్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుత గ్లోబలైజెడ్ ప్రపచంలో ఇతర దేశాల ప్రతిభ మన దేశానికి.. మన దేశ ప్రతిభ ఇతర దేశాలకు అవసరం అని స్పష్టం చేశారు. చైనా ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచేందుకు అలాగే టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు సాగేందుకు ప్రపంచ దేశాల ప్రతిభను చైనా ఆహ్వానిస్తోందని తెలిపారు. ప్రపంచ దేశాలకు చైనా డోర్లు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ నిపుణులు, మేధావులకు చైనాలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి గువో జియకన్ తెలిపారు. ప్రపంచ దేశాలకు చైనాలోని అన్ని రంగాల్లో దారులు తెరిచే ఉన్నాయని అన్నారు. చైనాలో అడుగుపెట్టి మానవత్వ విలువలను అలాగే కెరీర్ విజయాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజును పెంచిన తర్వాత చైనా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications