50 మంది సొంత బందీల్ని చంపుకున్న ఇజ్రాయెల్ ? హమాస్ సంచలన ప్రకటన..!
ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల తర్వాత ఆ దేశానికి చెందిన దాదాపు 200 మందిని బందీలుగా పట్టుకుపోయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై ప్రతిదాడులు మొదలుపెట్టింది. అయితే ఈ ప్రతిదాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఫలితం మాత్రం తేలడం లేదు. మధ్యలో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో ఇప్పటివరకూ 7 వేల మందికి పైగా పాలస్తీనియులు చనిపోయినట్లు తాజాగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు గాజాలో హమాస్ చెరబట్టిన 200 మంది బందీల్లో ఇప్పటివరకూ కొంత మందిని మాత్రం విడిచిపెట్టింది. కానీ ఇంకా మెజార్టీ బందీలు హమాస్ దగ్గరే ఉన్నారు. అయినా ఇజ్రాయెల్ మాత్రం గాజాపై యథేచ్చగా దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 50 మంది వరకూ చనిపోయినట్లు హమాస్ ఇవాళ ప్రకటించింది. ఇజ్రాయెల్ జరుపుతున్న బాంబు దాడుల్లోనే వీరంతా చనిపోయినట్లు హమాస్ ఆర్మీ వింగ్ తమ టెలిగ్రామ్ ఛానల్లో చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

అటు గాజాలో చనిపోయిన వారి సంఖ్య 7028కి చేరిందని పాలస్తీనా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 2913 మంది చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది. అలాగే హమాస్ ఉగ్రవాదులను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది. ఐడీఎఫ్ ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దుకు సమీపంలో ఉన్న కిబ్బట్జ్ బీరీలో తన ఆపరేషన్ వీడియో ఫుటేజీని విడుదల చేసింది. దీనిలో సైనికులు హమాస్ ఉగ్రవాదులను వెంబడించడం, నిమిషాల వ్యవధిలో వారిని మట్టుపెట్టడం కనిపించింది.
ఈ నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్.. పాలస్తీనాకు మద్దతుదారుగా ఉన్న టర్కీ ప్రభుత్వంతో మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోప్ ఫ్రాన్సిస్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తో ఫోన్ లో చర్చించారు. మరోవైపు హమాస్ ప్రతినిధుల బృందం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లి చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. హమాస్ కు మద్దతుగా ఉన్న రష్యా జోక్యం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అరబ్ దేశాలు కూడా ఆశాభావంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications