Hamas Hostages: హమాస్ చెరనుంచి 25 మంది బందీల విడుదల-ఇజ్రాయెల్, థాయ్ పౌరులే..
ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెల రోజులకు పైగా సాగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం ఇస్తూ ఇరువర్గాలూ సంధి కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఇరుదేశాల్లో బందీలుగా ఉన్న వారి విడుదలకు అంగీకరించాయి. ఈ ఒప్పందం ఇవాళ అమల్లోకి వచ్చింది. దీంతో ముందుగా హమాస్ గాజాలో బందీలుగా ఉంచిన 25 మందిని ఇవాళ విడుదల చేసింది. ఇందులో ఇజ్రాయెల్, థాయిలాండ్ పౌరులున్నారు.
ఇవాళ హమాస్ విడుదల చేసిన వారిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 12 మంది థాయిలాండ్ పౌరులు ఉన్నారు. ఈ మేరకు ఆయా దేశాలు తమ పౌరులు విడుదలైనట్లు నిర్ధారించాయి. అలాగే ఇదే ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇవాళ రాత్రికి విడుదల చేయబోతోంది. వారి పేర్లతో కూడిన జాబితాను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఒప్పందం సాఫీగా అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గాజా నుండి 12 మంది థాయ్ బందీలను విడుదల చేశారని, వారిని తీసుకురావడానికి ఎంబసీ అధికారులు వెళ్తున్నారని థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. విడుదలైన బందీల పేర్లు, ఇతర వివరాలు త్వరలో తెలుస్తాయని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ జైళ్ల నుండి విడుదలైన మొదటి బ్యాచ్‌లో ఉంటారని భావిస్తున్న పాలస్తీనా ఖైదీల పేర్లను హమాస్ విడుదల చేయగా.. ఇందులో 24 మంది మహిళలు, 15 మంది మైనర్లు ఉన్నారు. జాబితాలోని మెజారిటీ ప్రజలు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌కు చెందిన వారుగా తెలుస్తోంది.
ఖైదీలను రెండు జైళ్ల నుండి తరలిస్తున్నారు - హైఫాకు ఆగ్నేయంగా ఉన్న డామన్ మరియు మెగిద్దో - మరియు రెడ్‌క్రాస్ చివరి తనిఖీల కోసం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాకు దక్షిణంగా ఉన్న ఓఫర్ జైలుకు తరలించబడుతున్నారని ఇజ్రాయెల్ అధికారి సీఎన్ఎన్ వార్తా సంస్ధకు తెలిపారు.












Click it and Unblock the Notifications