Israel Hamas War: ఇజ్రాయెల్ యుద్ధం ముగింపుకు హమాస్ తాజా ప్రతిపాదన- 3 దశల్లో..!
ఇజ్రాయెల్ పై దాడులతో యుద్ధానికి తెరదీసిన హమాస్ ఇప్పుడు కాల్పుల విరమణ ద్వారా యుద్ధ విరమణకు ప్రతిపాదనలు పంపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో భారీగా నష్టపోవడం, ప్రజలు, పిల్లలు మృత్యువాత పడటంతో హమాస్ ఇప్పుడు తాజా ప్రతిపాదన చేసింది. దీన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తే త్వరలో యుద్ధం ముగిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై ఇజ్రాయెల్ స్పందన ఏంటన్నది చూడాల్సి ఉంది.
నాలుగున్నర నెలలుగా గాజాలో సాగుతున్న నరమేథానికి తెరదించేలా గత వారం ఖతార్, ఈజిప్టు మధ్యవర్తులు పంపిన ప్రతిపాదనకు హమాస్ స్పందించింది. అమెరికా మద్దతుతో యుద్ధానికి ముగింపు పలికే కాల్పుల విరమణ ప్రణాళికను హమాస్ ఇజ్రాయెల్ కు ప్రతిపాదించింది. హమాస్ పంపిన ఈ ప్రతిపాదనలో 45 రోజుల పాటు మూడు దశల కాల్పుల విరమణ ద్వారా యుద్ధాన్ని ముగించేలా ప్రణాళిక ఇచ్చారు.

అక్టోబర్ 7న పాలస్తీనా ఖైదీల కోసం హమాస్ నేతలు స్వాధీనం చేసుకున్న మిగిలిన ఇజ్రాయెలీ బందీలను ఈ ప్రతిపాదన ద్వారా మార్చుకోవచ్చు. అలాగే గాజా పునర్నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ దళాలు కూడా పూర్తిగా ఉపసంహరిస్తారు. మృతదేహాలు , అవశేషాల మార్పిడి కూడా ఉంటుంది. అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్, ఖతార్ , ఈజిప్ట్ నాయకులను కలుసుకున్న తర్వాత నిన్న రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు.
హమాస్ ప్రతిపాదన ప్రకారం ఇజ్రాయెల్ జైళ్ల నుండి పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేయడానికి బదులుగా మొదటి 45-రోజుల దశలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ మహిళలు, 19 ఏళ్లలోపు పురుషులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు విడుదలవుతారు. మిగిలిన మగ బందీలు రెండవ దశలో విడుదలవుతారు. మూడో దశలో మార్పిడులు ఉంటాయి. మూడవ దశ ముగిసే సమయానికి యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు పక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు హమాస్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications