వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదడుపై ధ్యానం ఎలా పనిచేస్తుంది? ఏకాగ్రత కోసం మెమరీ బూస్టర్స్ కంటే ధ్యానం మేలని ఎందుకు అంటున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
brain

వందల ఏళ్లుగా ప్రజలు తమ తెలివితేటలు, ఏకాగ్రత, సృజనాత్మకతను పెంచుకునేందుకు మార్గాలను వెతుకుతున్నారు. అందుకోసం నూట్రోఫిక్స్ వైపు చూస్తున్నారు. వీటినే మెమొరీ బూస్టర్స్ లేదా కాగ్నిటివ్ ఎన్‌హాన్సర్స్ అని కూడా అంటారు.

నిజం చెప్పాలంటే కాఫీ తాగడం కూడా ఒకలాంటి నూట్రోఫిక్‌ను తీసుకోవడమే. కాఫీలో ఉండే కెఫిన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అది వెంటనే మనకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

స్మార్ట్ డ్రగ్స్‌గా పిలవబడే ఈ నూట్రోఫిక్స్ మానవులకు అత్యావశ్యకం కానప్పటికీ ఎక్కువ ప్రజాదరణను పొందుతున్నాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుదలకు ఈ సప్లిమెంట్లు ఉపయోగపడతాయని (చాలా తక్కువ శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి) ప్రజలు నమ్మడంతో వాటికి ఇప్పుడు పెద్ద మార్కెట్ ఏర్పడింది.

మరికొంత మంది ఏకంగా ఈ సప్లిమెంట్లు వాడేందుకు డాక్టర్ల సలహాలను కోరుతున్నారు. ప్రిస్క్రిప్షన్ తీసుకొని మోడఫినిల్ వంటి ఉత్ర్పేరకాలను వాడుతున్నారు. పని ప్రదేశాల్లో మెరుగ్గా రాణించేందుకు వారు ఈవిధంగా చేస్తుంటారు.

గ్లోబల్ డ్రగ్ సర్వే ఆధారంగా 2017లో చేసిన దర్యాప్తులో 30 శాతం అమెరికన్లు గత 12 నెలల కాలంలో ఏదో ఒక స్మార్ట్ డ్రగ్‌ను తీసుకున్నట్లు వెల్లడైంది.

2015తో పోలిస్తే ఇది 20 శాతం పెరిగింది. కేవలం అమెరికాలోనే కాదు యూరప్ వ్యాప్తంగా వీటిని తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగినట్లు ఈ సర్వేలో తేలింది.

కానీ నిజంగానే ఈ ఉత్పత్తులు ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతాయా? వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయి?

తెలియకుండానే చేటు చేస్తాయి

''మన మెదడు గురించి మనకు ఎంత తక్కువ తెలుసో వింటే ఆశ్చర్యపోతాం. కానీ 'బ్రెయిన్ కెమిస్ట్రీ' పరంగా మన మెదడు ఎంతో జాగ్రత్తగా క్రమపద్ధతిలో రూపొందిన వ్యవస్థ అనేది అందరికీ తెలుసు. బ్రెయిన్ పనితీరు అనేది అందరిలో ఒకేలా ఉండదు. ప్రతీ ఒక్కరిలో ఒక్కో విధంగా పనిచేస్తుంది.'' అని నెదర్లాండ్స్ రాడ్‌బౌడ్ యూనివర్సిటీలోని డాండర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్, కాగ్నిషన్ అండ్ బిహేవియర్‌కు చెందిన కాగ్నిటివ్ న్యూరోసైంటిస్ట్ హానక డెన్ ఔడెన్ అన్నారు.

'మన బ్రెయిన్ కెమిస్ట్రీ వ్యవస్థ ఎలా రూపొందుతుంది, మనం ఎలా స్పందిస్తాం' అనే అంశాలపై ఆయన ప్రయోగశాలలో అధ్యయనం చేస్తారు.

''మోడఫినిల్ అనేది సైకోస్టిములంట్స్ (మానసిక ఉత్తేజకాలు) వర్గానికి చెందినది. మిథైల్‌ఫినిడేట్, ఆంఫేటమైన్ కూడా సైకోస్టిములంట్స్‌కు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ వర్గానికి చెందిన ఉత్ప్రేరకాలు మెదడులోని డోపమైన్ వ్యవస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయి.

brain

డోపమైన్ ఒక న్యూరోట్రాన్స్‌మీటర్. ఇది మెదడులోని ఏకాగ్రత, ఫోకస్ వంటి అంశాలకు సంబంధించిన సంకేతాలను ప్రేరేపితం చేయగలదు. అత్యుత్సాహం, హఠాత్తు ప్రవర్తనలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది.

అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడే వ్యక్తులకు మోడఫినిల్ చాలా ఉపయోగపడుతుంది. కానీ వైద్యపరంగా దీని అవసరం లేని వ్యక్తులు కూడా చట్టవిరుద్ధంగా ఈ ఉత్ప్రేరకాన్ని వినియోగించే అవకాశముంది.

''ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల్లో, ఆరోగ్యవంతులైన యువ జనాభా తీసుకునే నిర్ణయాలను, సైకోస్టిములంట్స్ ఎలా ప్రభావితం చేస్తాయో గమనించాం. ముఖ్యంగా మిథైల్‌ఫినిడేట్ అనే ఔపధంపై అధ్యయనం చేశాం. ఇది రిటాలిన్, అడెరాల్ అనే బ్రాండ్ పేర్లతో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ మందు చాలా క్రియలను మెరుగుపరుస్తున్నట్లు మేం కనుగొన్నాం'' అని ఔడెన్ చెప్పారు.

మెదడు చర్యలను ఉత్తేజపరిచే ఈ మందులను వైద్య సూచన లేకుండా తీసుకోవడం చాలా ప్రమాదకరమని ఔడెన్ హెచ్చరించారు.

''అన్ని మందులకు సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే గుణముంటుంది. అందుకే వాటిని ప్రిస్క్రిప్షన్ ప్రకారమే అమ్ముతారు.''

''అందుకే మేం సైకోస్టిములంట్స్‌ ఔషధాలపై అధ్యయనం చేసినప్పుడు, మొదటగా ఇందులో పాల్గొనే వారి గురించి విస్తృతంగా విశ్లేషిస్తాం. వారికి ఒక మోతాదు ఔషధం మాత్రమే ఇస్తాం'' అని వివరించారు.

''ఉదాహరణకు సైకోస్టిములంట్స్ గుండె కొట్టుకునే రేటును పెంచుతాయి. ఇది హృదయ సంబంధ వ్యాధులు ఉన్నవారికి తెలియకుండానే ఇది ప్రమాదకరంగా మారుతుంది.''

ఈ ఉత్ప్రేరకాలు కూడా అందరికీ ఒకే రకంగా పనిచేయవు. కొందరు ఇవి వాడటం వల్ల లబ్ధి పొందుతారు. మరికొందరికి వీటి నుంచి తగిన ప్రయోజనం లభించదు.

brain

ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో సైకోస్టిములంట్స్ వాడకం వల్ల దీర్ఘకాలం పాటు కలిగే సంజ్ఞానాత్మక ప్రభావాలపై ఎలాంటి అధ్యయనాలు జరగలేదని ఆయన అన్నారు.

మెదడులో డోపమైన్ స్థాయిలను పెంచడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయని అన్నారు.

''మన మెదడులోని రసాయనాల పటిష్ట సమతుల్యం గురించి మనం చర్చిస్తున్నాం. డోపమైన్ స్థాయిలను ఎక్కువగా పెంచి మెదడు పనితీరును మనం అడ్డుకున్నప్పడు, ప్రతిస్పందనగా మెదడులోని వ్యవస్థ తన సమతుల్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ ఉత్ప్రేరకం మెదడు సున్నితత్వాన్ని తగ్గించవచ్చు'' అని ఆయన వివరించారు.

''ఇక్కడ మరో ప్రమాదం కూడా ఉంది. ఇది ఊహజనితమైనదే. కానీ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అదేంటంటే అన్ని సమయాల్లో కూడా తీక్షణమైన ఏకాగ్రతను కలిగి ఉండటం సరికాదు. అన్ని సమస్యలకు దీనివల్ల పరిష్కారం దొరకదు.''

''అన్ని వేళలా అధికంగా చురుగ్గా ఉండటం వల్ల సృజనాత్మకత, కొత్త ఆలోచనలు రావడం, సరైన పరిష్కారాలు ఆలోచించే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి మనకు హైపర్- ఫోకస్డ్ వ్యక్తుల సమాజం అక్కర్లేదు.''

మెడిటేషన్

మెడికేషన్‌కు బదులుగా మెడిటేషన్ చేయండి

మందులు వాడి అసహజంగా మెదడు సామర్థ్యాన్ని పెంచడానికి బదులుగా, ధ్యానం వంటి సహజపద్ధతుల ద్వారా దాని పనితీరును మెరుగుపరచవచ్చని చూపించే ఆధారాలు పెరుగుతున్నాయి.

ఇది ఎలా పని చేస్తుంది?

''మానవ లక్షణాలలో ఒకటి ఏంటంటే... మనం అన్ని రకాల విచిత్రమైన అంశాల గురించే ఆలోచించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాం'' అని యునైటెడ్ స్టేట్స్ యేల్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ లారీ శాంటోస్ చెప్పారు.

''కొత్తగా ధ్యానం ప్రారంభించిన వారిలో కూడా, రోజుకి కేవలం 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తే అనవసరపు ఆందోళనలు తగ్గిపోయి మన మెదడు చురుగ్గా మారుతున్నట్లు అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి.''

''ఎంతో సులభమైన ఈ ధ్యానం, మెదడు పనితీరును అక్షరాల మారుస్తుంది'' అని శాంటోస్ అన్నారు.

మానసిక ఆందోళనలు ఎందుకు అంత మంచివి కావు?

ఈ అంశంపై చేసిన పరిశోధనల్లో, మన మెదడు ఆందోళనకు గురైనప్పుడు మనం విచారానికి గురవుతామని తేలినట్లు శాంటోస్ చెప్పారు.

''ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే... మనం ఎల్లప్పుడూ పూర్తి ఏకాగ్రతతో ఉండలేం. రుచికరమైన ఆహారం తినడం, స్నేహితులతో మాట్లాడటం వంటి జీవితంలోని చిన్నవిషయాలను ఆస్వాదించడానికి తీక్షణమైన ఏకాగ్రత అక్కర్లేదు'' అని ఆయన అన్నారు.

''మానసిక ఆందోళన అనేది మన జీవితంలోని సుఖాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.''

''అందుకే ధ్యానం వంటి అభ్యాసాలు దీనిపై చాలా శక్తిమంతంగా పనిచేస్తాయి. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనమేంటంటే ఇది మన మెదడు సామర్థ్యాన్ని సాధారణం కన్నా కాస్త ఎక్కువగా మెరుగయ్యేలా తీర్చిదిద్దుతుంది.''

ధ్యానం, మానసిక ఆందోళనను తగ్గించడమే కాదు మెదడులోని వివిధ భాగాల మధ్య సంబంధాలను కూడా పెంచుతుంది. ఇది మెదడు క్రియలను సమర్థవంతం చేస్తుంది.

2008 అధ్యయనం ప్రకారం, ధ్యానం చేసిన వ్యక్తులు 8 వారాల పాటు సంతోషంగా ఉంటారని తెలిసింది.

ధ్యానం కేవలం జీవితాన్ని ఆస్వాదించే అంశంలో మాత్రమే సహాయపడదు.

కాలిఫోర్నియా యూనివర్సిటీ 2013లో చేసిన అధ్యయనంలో ధ్యానం పరీక్షల్లో అధిక మార్కులు సాధించేందుకు ఉపయోగపడిందని తేలింది. దానివల్ల ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయని లారీ శాంటోస్ పేర్కొన్నారు.

''ఇది ఏకాగ్రతను పెంచుతుంది. కాలక్రమేణా జ్ఞాపకశక్తి పెరుగుదలకు సహాయపడుతుంది. శారీరక ఆరోగ్యంపై కూడా అనేక ప్రభావాలను చూపిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు, వృద్ధాప్య చాయలను తగ్గిస్తుంది.''

ధ్యానం వల్ల మెదడు శక్తి, ఆనందం, రోగనిరోధక శక్తి పెరుగుతున్నాయి. కాబట్టి ఇది మానవులకు అత్యంత ప్రయోజనకరమైనది అని చెప్పడం అతిశయోక్తి అవుతుందా?

''ఈ ప్రయోజనాలన్నీ కలిగి ఉన్న దాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. కానీ వారికి ధ్యానం అనేది మార్గంగా లభించింది. అనుభవపూర్వకంగా చెప్పాలంటే ధ్యానం వల్ల ఇంకా చాలా ఉపయోగాలుంటాయి.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
How does meditation work on the brain? Why is meditation better than memory boosters for concentration?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X