96 గంటల పాటు గ్రోక్ యుద్ధం! కోర్టు కేసుతో బయటపడ్డ అసలు నిజం.
యుద్ధ క్షేత్రంలో తుపాకులు, క్షిపణుల శబ్దాల కంటే.. తెర వెనుక నడిచే అల్గారిథమ్స్, కృత్రిమ మేధస్సు (AI) శబ్దాలే ఇప్పుడు ప్రపంచ గమనాన్ని శాసిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక విప్లవానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన 'గ్రోక్' (Grok) ఏఐ టూల్, ఇప్పుడు అమెరికా సైనిక వ్యూహాల్లో అత్యంత కీలకమైన అస్త్రంగా మారిపోయింది. ఇరాన్‌పై అమెరికా ఇటీవల జరిపిన అత్యంత వ్యూహాత్మక సైనిక దాడుల్లో ఈ సరికొత్త ఏఐ సాంకేతికతను ఉపయోగించినట్లు స్వయంగా యూఎస్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక పర్యావరణ ఉల్లంఘనల కేసులో అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన ఒక లీగల్ రిపోర్ట్ ద్వారా ఈ మైండ్ బ్లాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
కోర్టు కేసుతో బయటపడ్డ రక్షణ రహస్యం
నిజానికి, ఈ రహస్యం బయటకు రావడానికి కారణం ఒక పర్యావరణ వివాదం. మస్క్‌కు చెందిన 'ఎక్స్ఏఐ' (xAI) సంస్థ నడుపుతున్న ఒక భారీ డేటా సెంటర్‌లోని గ్యాస్ టర్బైన్ల వల్ల విపరీతమైన పర్యావరణ కాలుష్యం జరుగుతోందంటూ ఒక పౌర హక్కుల సంఘం కోర్టులో దావా వేసింది. అయితే, ఈ కేసులో అమెరికా న్యాయశాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో షాకింగ్ విషయాలను పేర్కొంది. ఈ డేటా సెంటర్‌కు కనుక విద్యుత్ సరఫరా నిలిపివేస్తే, దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని, రక్షణ రంగానికి సంబంధించిన కీలక ఏఐ సాంకేతిక ఆవిష్కరణలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

'ప్రాజెక్ట్ మావెన్'.. 96 గంటల్లో 2,000 దాడులు!
పెంటగాన్ ఏఐ విభాగానికి చెందిన కీలక అధికారి కామెరాన్ స్టాన్లీ కోర్టుకు సమర్పించిన నివేదికలో అసలు విషయాలను ధృవీకరించారు. అమెరికా మిలిటరీ శత్రువుల లక్ష్యాలను ఖచ్చితత్వంతో నిర్దేశించే అత్యంత రహస్య 'ప్రాజెక్ట్ మావెన్' (Project Maven) ప్రోగ్రామ్‌లో గ్రోక్ ఏఐ గవర్నమెంట్ మోడల్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' సమయంలో కేవలం 96 గంటల వ్యవధిలోనే దాదాపు 2,000 శత్రు లక్ష్యాలను గుర్తించి, దాడులు చేయడానికి ఈ 'గ్రోక్' సాంకేతికత పెంటగాన్ కార్యకలాపాల సామర్థ్యాన్ని ఊహించని రీతిలో పెంచిందని ఆయన కోర్టుకు వెల్లడించారు.
'క్లాడ్' నో చెప్పింది.. 'గ్రోక్' లైన్లోకి వచ్చింది!
గతంలో ఈ మిలిటరీ ప్రాజెక్ట్ కోసం అమెరికా సైన్యం 'యాంత్రోపిక్' సంస్థకు చెందిన 'క్లాడ్' (Claude) ఏఐ మోడల్‌ను ఉపయోగించేది. అయితే, తమ సాంకేతికతను మానవ ప్రాణాలను తీసే దాడులకు లేదా భారీ ఎత్తున నిఘా పెట్టడానికి ఉపయోగించడానికి ఆ సంస్థ పూర్తిగా నిరాకరించింది. నైతిక విలువల కారణంతో యాంత్రోపిక్ తప్పుకోవడంతో, అమెరికా రక్షణ శాఖ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. తదనంతరం, రక్షణ అవసరాల కోసం పెంటగాన్ గూగుల్, ఓపెన్ ఏఐలతో పాటు మస్క్ నేతృత్వంలోని 'ఎక్స్ఏఐ' వైపు మొగ్గు చూపింది.
మరోవైపు, నల్లజాతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో అనుమతులు లేకుండా టర్బైన్లు నడుపుతున్నారనే ఆరోపణలను ఎక్స్ఏఐ కొట్టిపారేసింది. అవి కేవలం అత్యవసర, తాత్కాలిక అవసరాల కోసమేనని స్పష్టం చేసింది. కాగా, ఎలాన్ మస్క్ ఇటీవలే తన ఎక్స్ఏఐ సంస్థను స్పేస్‌ఎక్స్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనా, యుద్ధ రంగాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధస్సు (AI) వినియోగం చుట్టూ ఉన్న అనేక నైతిక నియమాలు, పర్యావరణ వివాదాలను ఈ తాజా పరిణామాలు మరోసారి ప్రపంచం ముందు చర్చనీయాంశంగా ఉంచాయి.














Click it and Unblock the Notifications