భారత్ వద్దన్నా పాకిస్తాన్ కు 8 వేల కోట్లు..! ప్రపంచ బ్యాంక్ షాకింగ్..!
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ ప్రపంచ బ్యాంక్ ఉద్దీపన ప్యాకేజీ రూపంలో భారీ ఊరటనిచ్చింది. ఆర్ధిక వనరుల్లేకుండా యుద్దం ఎలా చేయాలని మల్లగుల్లాలు పడుతున్న పాకిస్తాన్ కు 2 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ రూపంలో భారీ ఊరటనిచ్చిన ప్రపంచ బ్యాంక్ ఆ తర్వాత భారత్ అభ్యంతరాల నేపథ్యంలో 11 షరతులు విధించింది. వీటిని అమలు చేస్తేనే ఈ ప్యాకేజీ అందిస్తామని తేల్చేసింది. దీంతో పాకిస్తాన్ ఈ షరతులు పాటించి ఉద్దీపన ప్యాకేజీ పొందడం కష్టమనే అంతా భావించారు.
ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న ఉద్దీపన ప్యాకేజీలను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్తాన్ వాడుకుంటోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ కు ఇవ్వాలనుకుంటున్న 2 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజ్ పై పునరాలోచన చేయాలని కోరింది. అయితే దీనిపై అంతర్గతంగా చర్చించుకున్న ప్రపంచ బ్యాంక్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు ఇచ్చే రుణంపై భారత్ అభ్యంతరాలు ఉన్నా ముందుకే వెళ్లాలని నిర్ణయించింది.

అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని ప్రపంచ బ్యాంక్ ఇవాళ సమర్ధించుకుంది. అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్.. తాము ఇవ్వజూపుతున్న రుణాన్ని పొందేందుకు అవసరమైన అన్ని లక్ష్యాలను చేరుకుందని కూడా వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్ రుణం కోసం పెట్టిన 11 షరతుల్ని అమలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రుణం విడుదల కాబోతున్నట్లు దీంతో అర్థమవుతోంది.
ప్రపంచ బ్యాంక్ ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కార్యక్రమం కింద రెండు విడతలుగా పాకిస్తాన్‌కు 2.1 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వాలని గతంలో ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో ఇవ్వజూపిన రుణాలతో కలిపి మొత్తం 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు వీలుగా ప్రపంచబ్యాంక్ ఒప్పందంపై పాకిస్తాన్ సంతకం చేసింది. దీనిపై భారత్ అభ్యంతరాలతో ప్రపంచ బ్యాంక్ వెనక్కి తగ్గుతుందని భావించినా అలా జరగలేదు.

పాకిస్తాన్ కు ఇస్తున్న రుణాన్ని సమర్ధించుకుంటూ ప్రపంచ బ్యాంక్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వాస్తవానికి అన్ని లక్ష్యాలను చేరుకున్నట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. తాము సూచించిన కొన్ని సంస్కరణలపై పాకిస్తాన్ పురోగతి సాధించిందని తెలిపారు. దీంతో ప్రపంచ బ్యాంక్ బోర్డు ముందుకు వెళ్లి పాకిస్తాన్ కు ఇచ్చే ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. దీంతో ప్రపంచ బ్యాంక్ ఈ బెయిల్ అవుట్ ప్యాకేజీపై స్పష్టంగానే ఉన్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications