ఇమ్రాన్ కుర్చీ లాగేసింది అమెరికాయేనా? పాక్ చరిత్రలోనే బిగ్గెస్ట్ లీక్..
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుర్చీ లాగేసుకోవడం వెనుక అమెరికా వేసిన పక్కా స్కెచ్ ఉందా? ఆయనను పదవి నుంచి దించేయడం వెనుక వైట్‌హౌస్ ఒత్తిడి పనిచేసిందా? అంటే.. 'అవుననే' అంటున్నాయి తాజా దౌత్య పరిణామాలు. ఇమ్రాన్ ఖాన్ 2022లో పదవి కోల్పోవడానికి కారణమంటూ అప్పట్లో సంచలనం సృష్టించిన 'రహస్య దౌత్య పత్రం' (సైఫర్) వ్యవహారం 'డ్రాప్ సైట్ న్యూస్' నివేదికతో మళ్లీ తెరపైకి వచ్చింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తెరవెనుక జరిగిన రాయబారాల్లో పాకిస్తాన్ పోషించిన పాత్ర, ఆ సమయంలో ఇమ్రాన్ తీసుకున్న స్వతంత్ర నిర్ణయాలే ఆయన రాజకీయ పతనానికి దారితీశాయనే చర్చ అంతర్జాతీయ వేదికలపై మళ్లీ హీట్ పెంచుతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన రోజునే ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటనకు వెళ్లడం అమెరికాకు అస్సలు నచ్చలేదు. ఈ పర్యటనకు ముందే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ పాక్ అధికారులను హెచ్చరించినప్పటికీ ఇమ్రాన్ వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత వాషింగ్టన్‌లోని పాక్ రాయబారితో అమెరికా సీనియర్ అధికారి డొనాల్డ్ లూ జరిపిన సంభాషణే ఈ 'సైఫర్' వివాదానికి మూలం. ఆ లీకైన పత్రాల ప్రకారం.. "ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలిస్తే వాషింగ్టన్ అన్నింటినీ క్షమిస్తుంది. లేదంటే పాక్‌తో ముందుకెళ్లడం కష్టం" అని డొనాల్డ్ లూ ఓపెన్‌గానే బెదిరించినట్లు లీకైన సైఫర్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు బయటకు రావడం అప్పట్లో ఇంటర్నేషనల్ వైడ్‌గా పెద్ద దుమారమే లేపింది.

అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వమే శాపమైందా?
ఇరాన్ అణు కార్యక్రమం, గల్ఫ్ దేశాల భద్రత విషయంలో అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నప్పుడు పాకిస్తాన్ నిశ్శబ్దంగా మధ్యవర్తిత్వం వహించింది. అప్పటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో పరోక్ష దౌత్య సంబంధాలు నడపడంలో పాక్ పౌర, సైనిక నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. అయితే ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ చైనా, ఇరాన్, అమెరికా వంటి భిన్న ధృవాలను బ్యాలెన్స్ చేయడం పాకిస్తాన్‌కు కత్తిమీద సాములా మారింది. దక్షిణాసియా విశ్లేషకుడు మైఖేల్ కుగెల్‌మాన్ చెప్పినట్లు.. ఈ వ్యూహాత్మక సమతుల్యత దెబ్బతినడం, అమెరికా మాట పక్కనబెట్టి ఇమ్రాన్ రష్యాతో చేతులు కలపడం వల్లే వైట్‌హౌస్ పెద్దలు పాక్ సైనిక లీడర్లతో కలిసి ఆయన్ను సైడ్ చేశారనే ఆరోపణలకు ఈ నివేదిక బలాన్ని ఇస్తోంది.
ఐఎంఎఫ్ ప్యాకేజీ.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు!
ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్ 2022లో పదవి నుంచి దిగిపోయాక, పాక్‌లో మిలిటరీ సపోర్ట్‌తో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే సీన్ పూర్తిగా మారిపోయింది. అమెరికాతో సంబంధాలను ఐస్‌లాండ్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్‌లోకి తెచ్చేందుకు పాక్ కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించే ఓటింగ్‌కు దూరంగా ఉన్న పాకిస్తాన్.. ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఫిరంగి గుండ్లు, సైనిక పరికరాలను సరఫరా చేయడం ప్రారంభించింది. ఈ ఆయుధాల సరఫరాకు ప్రతిఫలంగానే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి పాకిస్తాన్‌కు 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిందనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి.
బుకాయిస్తున్న అమెరికా, పాక్ ఆర్మీ
తమ అంతర్గత రాజకీయాల్లో అమెరికా వేలు పెట్టిందన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలను వాషింగ్టన్ మొదటి నుంచి ఖండిస్తూనే వస్తోంది. అటు పాక్ సైన్యం కూడా తాము ఇమ్రాన్‌ను దించేయలేదని, అంతా ప్రజాస్వామ్యబద్ధంగా అవిశ్వాస తీర్మానం ద్వారానే జరిగిందని చెబుతోంది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ వరుస కేసులతో జైల్లో ఉండగా.. ఆయన పార్టీ పీటీఐ (PTI) మాత్రం ఇదంతా పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని కొట్టిపారేస్తోంది.
చరిత్రలో నిలిచే దౌత్యం: ప్రధాని షెహబాజ్
ఈ వివాదాలన్నీ ఎలా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పోషించిన దౌత్య పాత్రను ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ గట్టిగా సమర్థించుకుంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య తమ దేశం చేసిన మధ్యవర్తిత్వం "పాక్ చరిత్రలోనే అత్యంత ప్రకాశవంతమైన క్షణం" అని ఆయన అభివర్ణించారు. అమెరికాలో పాక్ మాజీ రాయబారి మసూద్ ఖాన్ కూడా.. తన సుదీర్ఘ కెరీర్‌లో పాకిస్తాన్ ఇంతటి గ్లోబల్ హైప్‌లో ఉండటం ఎప్పుడూ చూడలేదని ప్రశంసించారు. ఏదేమైనా, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాత ఆరోపణలకు ఈ కొత్త దౌత్య పత్రాల లీకేజీ మరిన్ని సాక్ష్యాలను అందిస్తూ పాక్ రాజకీయాల్లో సరికొత్త రచ్చకు తెరలేపింది.














Click it and Unblock the Notifications