Covid cases In China: చైనాలో మరణమృదంగం.. భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు..
డ్రాగన్ దేశం చైనాలో కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేసులే కాదు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దేశ జనాభాలో 60 శాతం మంది.. అంటే సుమారు 84 కోట్ల మంది వైరస్ బారిన పడతారని అమెరికాకు చెందిన ప్రజారోగ్య శాస్త్రవేత్త ఎరిక్ ఫీగ్ల్-డింగ్ అంచనా వేశారు. ఆయన చెప్పిన విధంగానే చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

నిండిపోయిన ఆస్పత్రులు
జీరో కొవిడ్ పాలసి ఎత్తివేశాక కేసులు వేగంగా పెరుగుతన్నాయి. కేసులతో పాటు మరణాలు సంభవిస్తున్నా చైనా ప్రభుత్వం మాత్రం అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. కొవిడ్ రోగులతో ఇప్పటికే ఆస్పత్రులు నిండిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. బెడ్స్ ఖాళీలేక డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డుల్లో ఒక్కో బెడ్‌పై ఇద్దరిని, బెడ్స్ మధ్య నేలపైన కూడా రోగులను పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారట.

రోజుకు 200 మృతదేహాలు
చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు అంత్యక్రియల కోసం బీజింగ్ లో ఒక్క క్రిమటోరియానికే రోజుకు 200 మృతదేహాలను తీసుకొస్తున్నారని తెలిసింది. బీజింగ్‌లో రెండు మరణాలు నమోదైనట్లు అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ మరణాల లెక్క అధికారికంగా ప్రకటించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు చెబుతున్నాయి.

బీజింగ్‌లోనే 2700 మంది
ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్‌లోనే రోజుల వ్యవధిలో 2700 మంది చనిపోయినట్లు హాంకాంగ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. బీజింగ్‌లోని కొన్ని శ్మశానవాటికలు కొవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వివరించింది.జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తేశాక దేశంలో వైరస్ కేసులు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్ పింగ్ సర్కారు పట్టించుకోవట్లేదని ఎపిడమాలజిస్ట్ ఎరిక్ ఫెయిగిల్ డింగ్ విమర్శించారు.

5,327 మంది
చైనాలో ఇప్పటివరకు 5,327 మంది కొవిడ్‌తో మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ దేశంలో ఎవరైనా కేవలం కరోనా వల్ల చనిపోయినప్పుడే కొవిడ్ మరణంగా గుర్తిస్తారు. చాలామేర ఇతర దేశాల్లో మాత్రం కరోనా వైరస్ సోకి ఆ ప్రభావంతో ఇతర ఏ కారణాలతో మృతిచెందినా కొవిడ్ మరణాలుగానే లెక్కిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

30 నుంచి 40 మృతదేహాలు
సిటీలోని ఓ క్రిమటోరియంకు గతంలో రోజుకు 30 నుంచి 40 మృతదేహాలను అంత్యక్రియల కోసం తెచ్చేవారని, ఇప్పుడు రోజుకు సుమారు రెండొందల మృతదేహాలను తీసుకొస్తున్నారని పలు మీడియా కథనాలు వస్తున్నాయి. పని ఒత్తిడి బాగా పెరిగిందని, రోజులో 24 గంటలూ మృతదేహాలను కాలుస్తున్నామని అక్కడి సిబ్బంది చెప్పారని కథనాల్లో పేర్కొన్నాయి.

భారత్
చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేస్తుంది. కొవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications