జీ 7 సదస్సు కోసం భారత్‌కి దక్కని ఆహ్వానం.. కారణం అదే !
కెనడాలోని అల్బెర్టా వేదికగా జరగనున్న జీ7 సదస్సుకు (G7 Summit) భారత్‌కు ఇంకా ఆహ్వానం అందకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 15 నుంచి 17 వరకు ఈ సమ్మిట్ జరగనుంది. కానీ ఆహ్వానం అందకపోవడంతో ఆరేళ్లలో తొలిసారి ఈ సదస్సుకు ప్రధాని మోడీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్-పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికాను అనుమతించిన తర్వాత ఇది మన దేశానికి జరిగిన మరో దౌత్యపరమైన భంగపాటేనని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
ఈ అంతర్జాతీయ సదస్సులో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, కెనడాతో పాటు జర్మనీ అధినేతలు పాల్గొననున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అలానే బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకు కూడా ఆహ్వానం అందిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ వెల్లడించారు. 2014కు ముందుకు జీ8 గా ఉండేదని.. అప్పుడు నాటి ప్రధాని మన్మోహన్‌కు కూడా ఆహ్వానం వచ్చేదన్నారు. 2014 తర్వాత కూడా ఈ సంప్రదాయం కొనసాగినప్పటికీ.. ఆరేళ్లలో తొలిసారి మన ప్రధానికి ఆహ్వానం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విధంగా చూసిన కూడా దౌత్యపరంగా ఇదో భంగపాటేనని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మరోవైపు ఈ జీ7 సదస్సులో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపైనా కూడా సమీక్ష జరగనుందని భావిస్తున్నారు. జీ7 దేశాల్లో భారత్ లేకున్నప్పటికీ.. నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు మన ప్రధాని మోడీ ఆ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఈ సదస్సుకు ప్రధాని హాజరయ్యే అవకాశం లేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఆహ్వానం వచ్చినా.. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ అక్కడికి వెళ్లకపోవచ్చనే వాదన సైతం వినిపిస్తున్నారు. దీంతో జీ7లో ప్రధాని పాల్గొనకపోవడం ఆరేళ్లలో ఇదే తొలిసారి అవుతుందని చర్చ నడుస్తోంది. కాగా గతేడాది ఇటలీ వేదికగా జరిగిన సదస్సుకు భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణఅమెరికా, పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గొన్నాయి.












Click it and Unblock the Notifications