తాలిబన్లతో ఫలించిన చర్చలు-ఆప్ఘనిస్తాన్ కు భారీ మానవతాసాయం-అంగీకరించిన భారత్
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో భారత్ ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. ఇదే క్రమంలో తాలిబన్లతో అధికారికంగానే చర్చలు జరుపుతున్న భారత్.. తాజాగా ఓ అంగీకారానికి వచ్చింది. ఆప్ఘన్ పౌరుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారీ మానవతా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్ ప్రకటించింది. ఈ విషయాన్ని తాలిబన్లు కూడా నిర్దారించారు.
తాలిబన్లతో నిన్న జరిగిన చర్చల్లో భారత్ తరఫున విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి జేపీ సింగ్ పాల్గొనగా.. తాలిబన్ల తరఫున డిప్యూటీ ప్రధాని అబ్దుల్ సలామ్ హనాఫీ హాజరయ్యారు. ఈ చర్చల్లో ఇరువర్గాలు పరస్పరం ఆర్ధిక, దౌత్య సంబంధాలు విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాయి. అలాగే ఇరువురి సమస్యలపై సంయుక్తంగా దృష్టిసారించాలని నిర్ణయించాయి. ఆప్ఘనిస్తాన్ గడ్డ తీవ్రవాదులకు అడ్డాగా మారకూడదన్న పట్టుదలతో ఉన్న భారత్.. తాలిబన్లతో ఈ మేరకు అవగాహనకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా ఆప్ఘన్ కు భారీ ఆర్ధిక సాయం అందించేందుకు సిద్ధమవుతోంది.

ఆప్ఘన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి ఇబ్బందుల దృష్ట్యా ప్రస్తుతం 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమల్ని వెంటనే పంపాలని భారత్ నిర్ణయించింది. రవాణా, ఇతర సమస్యల కారణంగా మరింత సాయం అందించే విషయంలో ఇబ్బందులు ఉన్నట్లు భారత్ తెలిపింది. అలాగే ఈ సాయాన్ని కూడా ఐక్యరాజ్యసమితి ద్వారా చేయించాలని నిర్ణయించింది. మరోవైపు మాస్కో ఫార్మాట్ చర్చల్ని కొనసాగించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. గతంలో మాస్కోలో జరిగిన చర్చల్లో భారత్, రష్యా, ఆప్ఘనిస్తాన్ సహా మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. ఆప్ఘన్ భవిష్యత్తుపై ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఆప్ఘనిస్తాన్ లో గతంలో ఉన్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించిన భారత్.. అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టింది. అలాగే భవిష్యత్తులోనూ ఆప్ఘనిస్తాన్ భూభాగం రక్షణ పరంగా భారత్ కు కీలకంగా మారనుంది. దీంతో తాలిబన్లతోనూ సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని భారత్ భావిస్తోంది. అలాగే ఆప్ఘన్ గడ్డపై తీవ్రవాదులు పాగా వేస్తే భారత్ కు ఎదురయ్యే ఇబ్బందులపైనా దృష్టిసారిస్తోంది. అందుకే భారీ ఎత్తున ఆర్ధిక సాయం ప్రకటించడం ద్వారా ఆప్ఘనిస్తాన్ నుంచి సమస్యలు ఎదురుకాకుండా భారత్ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications