ఆపరేషన్ సింధూర్ లో మరిన్ని షాకింగ్ నిజాలు..! బయటపెట్టిన కేంద్రం..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఇందులో భాగంగా తొలుత ఉగ్ర శిబిరాలతో ప్రారంభించి అనంతరం పాకిస్తాన్ మిలటరీ బేస్ లను, క్షిపణి రక్షణ వ్యవస్థలను సైతం దెబ్బతీసిన భారత్ ఆ వివరాల్ని పూర్తిగా వెల్లడించడంలో మాత్రం ఎందుకో తడబడుతోంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ కు తాము చేసిన నష్టాన్ని దేశ ప్రజలకు తెలియజేయడంలో గోప్యత పాటిస్తున్న కేంద్రానికి పాకిస్తాన్ తాజాగా షాకిచ్చింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఆ దేశం చెబుతున్న దాని కంటే తాము చాలా ఎక్కువగా నష్టపోయామని పాకిస్తాన్ ఈ మధ్యే వివరాలు బయటపెట్టింది. దీంతో భారత్ ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు జరిగిన నష్టాల్ని కేంద్రం బయటపెట్టింది. ఇందులో పాకిస్తాన్ యుద్ధ విమానాలతో పాటు మిస్సైళ్లు, డ్రోన్లను తాము ఏ స్ధాయిలో కూల్చేసిందీ వెల్లడించింది.

కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఆపరేషన్ సింధూర్ లో భారత్ దాడులకు పాకిస్తాన్ ఏకంగా 9 యుద్ధ విమానాలు కోల్పోయింది. ఇందులో 6 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాలతో పాటు రెండు ఖరీదైన విమానాలు, మరో సీ130 రవాణా విమానం కూడా ఉన్నాయి. వీటితో పాటు 10కి పైగా మానవరహిత వాహనాలు(డ్రోన్లు), మరికొన్ని క్రూయిజ్ క్షిపణుల్ని కూడా కూల్చేసినట్లు కేంద్రం ఇవాళ తెలిపింది. వీటితో పాటు పాకిస్తాన్ లోని రక్షణ వ్యవస్థల్ని కూడా కూల్చేసినట్లు ప్రకటించింది.
పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లపై తాము జరిపిన దాడుల్లో హ్యాంగర్‌లో ఫైటర్ జెట్‌లు కూడా ఉన్నాయని సమాచారం ఉందని, కానీ పాకిస్తానీయులు అక్కడి నుండి శిథిలాలను కూడా బయటకు తీయడం లేదు కాబట్టి తాము నేలపై యుద్ధ విమాన నష్టాలను లెక్కించడం లేదని రక్షణ వర్గాలు తెలిపాయి. భారత వైమానిక దళం పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేయడానికి గాలి నుండి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులను మాత్రమే ఉపయోగించిందని, ఈ దాడులలో ఉపరితలం నుండి ఉపరితలానికి బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించలేదని వారు వెల్లడించారు.
రాఫెల్, సు-30 జెట్‌లు హ్యాంగర్‌పై చేసిన దాడుల్లో ఒకదానిలో భారీగా చైనీస్ వింగ్ లూంగ్ సిరీస్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్‌లు ధ్వంసమయ్యాయని రక్షణ వర్గాలు చెప్తున్నాయి. ఈ వివాదంలో పాకిస్తాన్ గగనతలంలో ఉన్న వివిధ ఎయిర్ ఫోర్స్ వైమానిక రక్షణ వ్యవస్థలు 10కి పైగా మానవరహిత విమానాలను కూడా ధ్వంసం చేశాయని తెలిపాయి. అలాగే వివిధ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఆకాశం, భూమి నుండి ప్రయోగించిన క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను పెద్ద ఎత్తున అడ్డగించాయని కూడా తెలిపాయి.












Click it and Unblock the Notifications