కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చివేత- భారత్ కు మోస్ట్ వాంటెడ్ ..
భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ ను ఇవాళ కెనడాలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్ఐఏ పలు కేసులు మోపింది. అలాగే ఆయన పేరుతో క్యాష్ రివార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలో కెనడాలో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ ను ఇవాళ కాల్చిచంపారు.
కెనడాలోని బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలో ఉన్న సర్రే సిటీలో హర్దీప్ సింగ్ నిజ్జార్ ను ఉద్దేశపూర్వకంగానే అగంతకులు కాల్చిచంపినట్లు తెలుస్తోంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్ధ తరఫున కెనడాలో ప్రత్యేక ఖలిస్తానీ దేశం కోసం కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిలో నిజ్జార్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ సంస్ధ ఇప్పటికే కెనడాతో పాటు పలు దేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో భారత ఎంబసీలతో పాటు పలు సంస్ధల్ని టార్గెట్ చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితా విడుదల చేసింది. ఇందులో నిజ్జార్ పేరు కూడా ఉంది. 2022లోనే నిజ్జార్ పై జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏ జలంధర్ లో హిందూ పూజారిని కాల్చిచంపిన కేసు నమోదు చేయడంతో పాటు ఆయన్ను పట్టించిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించింది. హిందూ పూజారి హత్యలో నిజ్జార్ పనిచేస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సంస్ధ పాత్ర ఉందని ఎన్ఐఏ తేల్చింది.
కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ మద్దతుదారులైన సిక్కులకు మద్దతిస్తుందన్న వార్తల నేపథ్యంలో అక్కడ ఆశ్రయం పొందుతున్న నిజ్జార్ ఇవాళ హత్యకు గురికావడం సంచలనం రేపింది. పంజాబ్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజ్జర్‌పై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను భారత్ ఇప్పటికే కోరింది.












Click it and Unblock the Notifications