భారత్‌పై పగబట్టిన ట్రంప్
అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో చోటు చేసుకుంటోన్న మార్పులు.. భారతీయ విద్యార్థులను దెబ్బకొడుతున్నాయి. వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశలను నీరుగారుస్తోన్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయ విద్యార్థులే అధికంగా బలి అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చదువుకోవడానికి తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే. స్టూడెంట్స్ విసాల్లో పెను మార్పులను తీసుకొచ్చాయి ఈ రెండు శాఖలు. సంస్కరణలకు తెర తీశాయి.

దీనివల్ల భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. కిందటి నెలలో 300లకు పైగా స్టూడెంట్స్ వీసాలు రద్దయినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ వెల్లడించింది. స్టూడెంట్ విసాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకోవడానికి వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టింది. క్యాచ్ అండ్ రివోక్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం- క్యాచ్ అండ్ రివోక్‌లో 327 కేసులు నమోదు కాగా.. ఇందులో 50 శాతం భారతీయ విద్యార్థులే. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారతీయ స్టూడెంట్ విసాలే అధిక శాతం రద్దు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాజకీయ పార్టీలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొన్న ఇద్దరు విద్యార్థుల స్టూడెంట్ విసా సైతం రద్దు కావడం చర్చనీయాంశమైంది. చైనా, దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థుల విసాలు కూడా రద్దయినప్పటికీ వాటి శాతం తక్కువే. ఆయా దేశాల విద్యార్థుల్లో 50 శాతం మంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై డిపెండ్ అయిన వాళ్లు ఉన్నారు.
ఈ ఏడాది జనవరి 20వ తేదీ నుంచి అంటే- అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి 4,736 దరఖాస్తులు రద్దయినట్లు స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS termination) తెలిపింది. వీటిలో ఎక్కువ శాతం ఎఫ్1 కేటగిరీలో ఉన్నవే.
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అమలులోకి వచ్చిన సెవిస్ టెర్మినేషన్ కొత్త నిబంధనలు, విధి విధానాలపై ప్రభుత్వం నుండి ముందస్తు సమాచారం ఉండట్లేేదని, ఇది విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోందని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ చెబుతోంది.
స్టూడెంట్స్ విసా కోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్థుల్లో 14 శాతం మంది మాత్రమే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుండి నోటీసు అందుకున్నారని, వారందరూ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై ఉన్న వాళ్లేనని ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. వాళ్ల ట్రైనింగ్ కూడా రద్దయినట్లు వివరించింది.












Click it and Unblock the Notifications