సీజ్ ఫైర్ కు ఓకే- ట్రంప్ పరువు నిలబెట్టిన ఇరాన్?
Israel Iran Ceasefire: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య 12 రోజులుగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. కాల్పుల విరమణను పాటించనున్నట్లు వెల్లడించింది. సీజ్ ఫైర్ ఒప్పందం అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.
ఈ ప్రకటన చేయడానికి కొద్దిసేపటి ముందు వరకూ ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షాన్ని కురిపించింది ఇరాన్. వ్యూహాత్మకంగా అత్యంత ప్రధానమైనదిగా భావించే బీర్షెబా సిటీపై ఏకధాటిగా బాంబు దాడులను కొనసాగించింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా ప్రకటించింది.

ఆ తరువాత సీజ్ ఫైర్ అంశాన్ని ప్రస్తావనను తెరమీదికి తీసుకొచ్చింది ఇరాన్. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ ను అంగీకరిస్తోన్నట్లు వెల్లడించింది. తాము కాల్పుల విరమణ ప్రతిపాదనలను ఎంతవరకు కొనసాగిస్తామనే విషయం ఇజ్రాయెల్ మీద ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే ప్రతిఘటన తప్పదనీ హెచ్చరించింది.
ఇదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా నిర్ధారించారు. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని అన్నారు. యుద్ధ విరమణ ఇప్పుడు అమలులో ఉందని, దయచేసి దీన్ని ఎవరూ ఉల్లంఘించవద్దని ఆయన ఈ రెండు దేశాలకూ విజ్ఞప్తి చేశారు. ఎవ్వరూ ఉద్రేకానికి గురి కావొద్దని సూచించారు.
ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా నెట్ వర్క్ ట్రూత్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ తాను ప్రతిపాదించిన సీజ్ ఫైర్ కు అంగీకారం తెలిపాయని, ప్రస్తుతం ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉందని తెలిపారు. ఏ ఒక్క దేశం కూడా దీన్ని ఉల్లంఘించబోదని ఆశిస్తున్నట్లు చెప్పారు.
డొనాల్డ్ ట్రంప్ చేసిన సీజ్ ఫైర్ ఒప్పందం ప్రకారం- ఇరాన్ 12 గంటల తరువాత కాల్పుల విరమణను చేపడుతుంది. ఇజ్రాయెల్ 24 గంటల తరువాత కాల్పుల విరమణను అమలు చేస్తుంది. మొత్తంగా 24 గంటల వ్యవధిలో- ఈ యుద్ధానికి అధికారికంగా తెరపడినట్టవుతుందని ట్రంప్ చెప్పారు.
కాల్పుల విరమణకు అంగీకరించిన ఈ రెండు దేశాలను అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కాల్పుల విరమణ సమయంలో- ఇరు దేశాలు శాంతియుతంగా, గౌరవంగా వ్యవహరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోన్నానని అన్నారు. ఈ సీజ్ ఫైర్ ప్రక్రియ మొత్తం కూడా సజావుగా సాగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ యుద్ధాన్ని ముగించడానికి ఓర్పు, ధైర్యం, మేధస్సు ప్రదర్శించిన ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకు అభినందనలు తెలియజేస్తోన్నానని ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధం.. సంవత్సరాల తరబడి కొనసాగి, మధ్య- తూర్పు ప్రాంతం మొత్తాన్నీ నాశనం చేసే ప్రమాదం ఉందని, అలా జరగలేదని తెలిపారు. ఇక ఎప్పటికీ జరగబోదనీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications