Iran War: సీజ్ ఫైర్ పై తేల్చేసిన ఇరాన్..! ట్రంప్ కు ఘాటు కౌంటర్..!
ఇరాన్ (iran)కొత్త నాయకత్వం కాల్పుల విరమణ కోసం సంప్రదించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ పేర్కొన్నారు. అయితే కీలకమైన హార్ముజ్ చమురు రవాణా మార్గాన్ని ప్రపంచ నౌకాయానానికి తిరిగి తెరిస్తేనే తాము దాన్ని పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. హార్ముజ్ జలసంధి తెరుచుకుని, స్వేచ్ఛగా, స్పష్టంగా ఉన్నప్పుడు తాము యుద్ధ విరమణను పరిశీలిస్తామని వెల్లడించారు. దీనిపై ఇరాన్ ఘాటుగానే స్పందించింది.
కాల్పుల విరమణకు ఇరాన్ ప్రతిపాదించిందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇరాన్ ఎలాంటి కాల్పుల విరమణ ప్రతిపాదన చేయలేదని తేల్చేశారు. ఇరాన్ ప్రతిపాదించిందని చెబుతున్న ఐదు సూత్రాల ప్రణాళిక కేవలం మీడియా ఊహాగానం మాత్రమే అన్నారు. దురాక్రమణదారుడికి శిక్ష పడి, ఇరాన్‌కు పూర్తి నష్టపరిహారం చెల్లించే వరకు యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు. దీంతో ఇరాన్ సీజ్ ఫైర్ అడుగుతున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది.

మరోవైపు హార్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా స్పందించింది. హార్ముజ్ జలసంధి తమ పూర్తి, నిర్ణయాత్మక నియంత్రణలోనే ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్పష్టం చేసింది. ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడంపై డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హాస్యాస్పద ప్రదర్శనలు, ప్రతిపాదనలను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ప్రకటనలో.. హార్ముజ్ జలసంధిలోని పరిస్థితి తమ నావికా దళాల దృఢంగా, ఆధిపత్యంగా నియంత్రణలో ఉందని, ఒత్తిడి లేదా చర్చల ద్వారా శత్రువులకు దానిని తెరవబోమని తెలిపింది. అమెరికా అధ్యక్షుడి హాస్యాస్పద ప్రదర్శనల ద్వారా హార్ముజ్ జలసంధిని ఈ దేశ శత్రువులకు తెరవబోమని వెల్లడించింది.












Click it and Unblock the Notifications