Iran Israel War: ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్.. నటాంజ్ అణు కేంద్రంలో రేడియేషన్
Iran Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. అణ్వాయుధాలను తయారు చేస్తున్న ఇరాన్ ఆగడాలను ఆపాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అయితే ఇరాన్ లో ఉన్న పలు అణు కేంద్రాలపై దాడి చేశారు. దాంట్లో భాగంగా నటాంజ్ అణు శుద్దీకరణం కేంద్రంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ కేంద్రంపై పలుమార్లు తీవ్రంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. నటాంజ్ అణుకేంద్రంపై దాడి చేసిన తర్వాత అక్కడ ఎటువంటి రేడియేషన్ లీక్ జరగలేదని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.
కానీ ఇజ్రాయెల్ ఇరాన్‌లోని నటాంజ్ అణు స్థావరంపై జరిపిన వైమానిక దాడులు అంతర్గత రేడియోలాజికల్, రసాయన కాలుష్యానికి కారణమయ్యాయని ధృవీకరించింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్ష(IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఇచ్చిన తన ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే కేంద్ర వెలుపల రేడియేషన్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయని.. ప్రజలకు లేదా పర్యావరణానికి ఎటువంటి ముప్పు లేదని ఆయన పేర్కొన్నారు. "అయినప్పటికీ వైమానిక దాడుల కారణంగా నటాంజ్‌లోని సదుపాయాలలో రేడియోలాజికల్, రసాయన కాలుష్యం ఉంది. ఈ సదుపాయంలో ఉన్న రేడియేషన్ రకం, ప్రధానంగా ఆల్ఫా కణాలు, సరైన రేడియేషన్ రక్షణ చర్యలతో నిర్వహించాలి" అని గ్రోసీ తన ప్రకటనలో తెలిపారు.

ఇజ్రాయెల్ దాడులు పైభాగంలో ఉన్న పైలట్ ఫ్యూయల్ ఎన్రిచ్‌మెంట్ ప్లాంట్‌ను ధ్వంసం చేశాయని, అక్కడ యురేనియం 60 శాతం U-235 వరకు శుద్ధి చేయబడుతోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్ష చీఫ్ అన్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి, అణు భద్రత, సురక్షితత్వాన్ని నిర్ధారించడానికి ఏజెన్సీ ఇరాన్ అణు నియంత్రణ అథారిటీతో శాశ్వత సంప్రదింపులలో ఉందని రాఫెల్ గ్రోసీ పేర్కొన్నారు. ఈ దాడులలో నటాంజ్ నతాంజ్ ఫ్యూయల్ ఎన్రిచ్‌మెంట్ ప్లాంట్ స్థావరం మాత్రమే దాడికి గురైందని ఇరాన్ ధృవీకరించింది. నటాంజ్ కేంద్రం నుంచి భారీ స్థాయిలో నల్లటి పొగ వస్తున్న వీడియోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఏ మేరకు డ్యామేజ్ జరిగిందన్న దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు ఇరాన్ అణు శాస్త్రవేత్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అణ్వాయుధ కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ప్రపంచ దేశాలను టార్గెట్ చేసే ఉద్దేశంతో ఇరాన్ అణ్వాయుధాలను రూపొందిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడి చేయడం తప్ప మరో అవకాశం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. టెల్ అవీవ్ నగరంపై క్షిపణులతో విరుచుకుపడింది.












Click it and Unblock the Notifications