హార్మూజ్ జలసంధిపై కొత్త టోల్ ఫీజు..! ఇరాన్ కీలక నిర్ణయం..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు స్పష్టం అవుతోంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల కోసం ఇరాన్ ఒక కొత్త టోల్ విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే కొన్ని విదేశీ నౌకలపై ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది.
తాజాగా ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజీ తెలిపిన వివరాల ప్రకారం.. హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల రాకపోకలను పర్యవేక్షించడానికి అలాగే టోల్ ఫీజు వసూలు చేయడానికి ఇరాన్ ఒక ప్రొఫెషనల్ మెకానిజం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా నౌకలు ప్రయాణించే ఒక నిర్దిష్ట మార్గాన్ని ఖరారు చేశారు. ఈ వ్యవస్థను త్వరలోనే అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
ఈ కొత్త రవాణా మార్గం కేవలం వాణిజ్య నౌకలు, అలాగే ఇరాన్ తో సహకరిస్తున్న దేశాలు, సంస్థలకు చెందిన వాటికే ప్రయోజనం చేకూరనుందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజీ పేర్కొన్నారు. తమ దేశ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ భద్రతకు హామీ ఇచ్చే పరిధిలోనే ఇరాన్ ఈ కొత్త టోల్ ఫీజ్ వ్యవస్థను అభివృద్ధి చేసిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ రుసుముల విధింపు విధానం, వసూలు చేసే మొత్తం ఎంత అన్నదానిపై పూర్తి వివరాలను ఆయన ఇంకా వెల్లడించలేదు.

ఇక ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురు, గ్యాస్ షిప్ మెంట్స్ లో చాలా భాగం ఈ హార్మూజ్ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రంతో అనుసంధానించే ఈ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరా చైన్ లో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా పరిగణిస్తున్నారు. భారత్ కు కూడా హర్మూజ్ జలసంధి చాలా కీలకం. భారత్ తన ముడి చమురులో దాదాపు 80 శాతం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుంది. ఆ చమురులో దాదాపు 60 శాతం హార్మూజ్ జలసంధి మార్గం నుంచే రావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications