Israel-Hamas War: ఇజ్రాయెల్ మొత్తం బందీలు 199- చిన్నారుల వీడియో విడుదల చేసిన హమాస్...
ఇజ్రాయెల్ పై భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఏకకాలంలో హమాస్ మెరుపు దాడులు ప్రారంభించి వారం కావస్తోంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ వైపు నుంచి భారీ స్ధాయిలో ప్రతిదాడులు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో ఇప్పటివరకూ ఇరువైపులా 4 వేల మంది వరకూ చనిపోయారు. ఇందులో 2600 మంది పాలస్తీయనియన్లు ఉండగా.. 1400 మంది వరకూ ఇజ్రాయెల్ పౌరులు, సైనికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో హమాస్ వారం క్రితం కిడ్నాప్ చేసి పట్టుకుపోయిన బందీలపై క్లారిటీ వచ్చింది.
ఇజ్రాయెల్ కు చెందిన మొత్తం 199 మంది పౌరులు, సైనికులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు తేలింది. హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్లు గాజాలో మొత్తం 199 మందిని బందీలుగా ఉంచుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ ప్రకటించింది. గతంలో హమాస్ వద్ద కొద్దిమందే బందీలుగా ఉన్నారని అనుకున్నా ఆ సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. ఇందులో పలువురు విదేశీ పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

హమాస్ తన సాయుధ ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న శిశువులు, పిల్లలను చూపించే విజువల్స్‌ను ఇవాళ విడుదల చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు కూడా షేర్ చేసిన ఫుటేజ్‌లలో ఇది ఒకటి. ఇజ్రాయెల్ భూ దండయాత్ర సమయంలో హమాస్ పిల్లలను కవచాలుగా వాడుకోవచ్చనే వాదనను నిర్ధారించేలా ఈ విజువల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో హమాస్ ముష్కరుడు ఏడుస్తున్న పిల్లవాడిని శాంతింపజేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఓ పసికందు ఒక ప్రామ్‌లో పడుకుని ఉంది. దాని చుట్టూ అనేక మంది సాయుధ మిలిటెంట్లు ఉన్నారు.
ఇజ్రాయెల్ భూమార్గంలో దాడుల్ని ఉధృతం చేస్తున్న తరుణంలో 200 మంది వరకూ వారి దగ్గర బందీలుగా ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది. గాజాపై చేసే దాడులకు ప్రతీకారంగా వీరిని చంపేస్తామని హమాస్ ఇప్పటికే హెచ్చరికలు చేస్తోంది. ఈ తరుణంలో ఇజ్రాయెల్ ఆర్మీ కూడా బందీల సంఖ్యను నిర్ధారించడంతో ఇకపై ఆ దేశం గాజాపై వేసే అడుగులు ఉత్కంఠ రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications