ఇజ్రాయెల్-హమాస్ డీల్ పై నెతన్యాహు క్లారిటీ-అమెరికా ఒత్తిడి వేళ కీలకం..!
ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడుల తర్వాత ఇరుదేశాల మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావం పాలస్తీనాలో మిగతా నగరాలపై లేకపోయినా గాజా సిటీపై మాత్రం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ భూమార్గంలో చేస్తున్న దాడులతో గాజా సిటీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అలాగే ఆస్పత్రులపై ఇజ్రాయెల్ దళాల దాడుల్ని అంతర్జాతీయంగా అన్ని దేశాలూ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో చిన్నారులు ఎక్కువగా చనిపోతున్న నేపథ్యంలో హమాస్ తో ఆ దేశం ఒప్పందం చేసుకోవాల్సిందేనని అంతర్జాతీయంగా ఒత్తిడి తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఇన్నాళ్లూ ఇజ్రాయెల్ ను సమర్ధించిన అమెరికా, దాని మిత్రదేశాలు కూడా హమాస్ తో ఒప్పందం చేసుకోమంటూ ఒత్తిడి తెస్తుండటంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరుకునపడ్డారు. దీంతో ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.

అయితే ఇజ్రాయెల్ కు చెందిన దాదాపు 200 మందికి పైగా బందీలు హమాస్ వద్ద ఉండటంతో వీరిని విడుదల చేస్తే దాడులు ఆపేస్తామని ఆ దేశం ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం హమాస్ తో ఎలాంటి డీల్ కుదరలేదని ఇవాళ తేల్చిచెప్పేశారు. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో నెతన్యాహు ప్రకటన కలకలం రేపింది.
అమెరికా, ఇజ్రాయెల్ , హమాస్ గాజాలో బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ మహిళలు, పిల్లలను విడిపించేందుకు తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా ఐదు రోజుల పోరాట విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ కూడా అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం బందీలను విడిపించేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు వచ్చిన నివేదికలు తప్పు అని పేర్కొన్నారు. ఇప్పటికి ఎటువంటి ఒప్పందం లేదన్నారు.












Click it and Unblock the Notifications