మరో మారణహోమానికి ఇజ్రాయెల్ ? రాఫా ప్లాన్ పై ఐరాస అత్యవసర భేటీ కోరిన అరబ్ దేశాలు..!
ఇజ్రాయెల్ పై హమాస్ ఆకస్మిక దాడులతో పశ్చిమాసియాలో రేగిన చిచ్చు మరణహోమాలకు కారమవుతోంది. ఇప్పటికే హమాస్ పై ప్రతీకారం పేరుతో గాజా సిటీని దాదాపు నాశనం చేసేయడంతో పాటు వేల మంది మరణాలకు కారణమైన ఇజ్రాయెల్ దాడులు ఇప్పుడు మరో నగరం రాఫాకు విస్తరించబోతున్నాయి. గాజా నగరంపై దాడులతో ప్రాణాలు దక్కించుకునేందుకు అక్కడి పౌరులు రాఫాకు భారీగా వలసపోయారు. ఇప్పుడు రాఫాపై దాడులకు ఇజ్రాయెల్ రచిస్తున్న వ్యూహాలతో వారి జీవితాలు తిరిగి ప్రమాదంలో పడ్డాయి.
దక్షిణ గాజాలో ఉన్న రాఫా నగరంపై దాడులకు ఇజ్రాయెల్ వ్యూహాలు మొదలుపెట్టింది. అయితే రద్దీగా ఉండే రాఫా నగరం నుంచి సాధారణ పౌరులు సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన అక్కడి ప్రజల్లో కొత్త ఆందోళనలు నింపుతోంది. తాము విజయానికి చేరువలో ఉన్నామని, రాఫాలో మిగిలిన హమాస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకోబోతున్నట్లు నెతన్యాహు ప్రకటించారు.

మరోవైపు రాఫాపై దాడులకు దిగితే గత అక్టోబర్ 7న తాము జరిపిన దాడుల్లో బందీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడటం ఖాయమని హమాస్ హెచ్చరించింది. అన్నింటికంటే మించి రాఫాలో ఆశ్రయం పొందుతున్న గాజాలోని 2.3 మిలియన్ల జనాభాలో సగానికి పైగా ప్రజలు ఇప్పుడు ఆహారం, నీరు, వైద్య సామాగ్రి కొరతను ఎదుర్కొంటున్నారు. దీంతో తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడింది.
అటు ఇజ్రాయెల్ చర్యలపై అమెరికా సహా ఇతర మిత్ర దేశాలూ మండిపడుతున్నాయి. రాఫాలో ఆశ్రయం పొందుతున్న గాజా పౌరులపై ఇజ్రాయెల్ చర్యలు తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నాయి. అలాగే అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశాయి. ఇజ్రాయెల్ ను కట్టడి చేయడంలో ఐరాస వైఫల్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఇందులో ఈజిప్ట్ అయితే ఇజ్రాయెల్ రాఫాపై దాడులకు దిగితే 50 ఏళ్ల క్రితం ఆ దేశంతో కుదుర్చుకున్న క్యాంప్ డేవిడ్ శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటామని హెచ్చరిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ లో పౌరులు సైతం నెతన్యాహు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వాన్ని గద్దెదించి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ బందీల్ని హమాస్ చెర నుంచి విడిపించలేని నెతన్యాహు పదవి నుంచి దిగిపోవాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications