• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బుల్లెట్ ఆమె ఛాతీలో ఎక్కడ దిగిందో తెలియలేదు... ఆపరేషన్ చేసి వెతికి బయటకు తీశారు

By BBC News తెలుగు
|
అయూబ్ టీచింగ్ హాస్పిటల్

ఆరు నెలలుగా ఓ మహిళ ఛాతీలో చిక్కుకున్న తుపాకీ గుండును ఆపరేషన్ చేసి బయటకు తీశారు డాక్టర్లు. ఇంతకూ ఆమె గుండెలో ఆ బుల్లెట్ ఎక్కడ దాక్కుందో డాక్టర్లకు అంతుచిక్కలేదు. దీన్నే బ్లైండ్ బుల్లెట్ అంటారు.

"పేషెంట్ గుండె భాగాన్ని తెరిచాం. బుల్లెట్ ఫలనా చోట ఉండి ఉంటుందని ఊహించి ఆపరేషన్ ప్రారంభించాం. గుండె చుట్టుపక్కలంతా వెతికాం, నరాలు పక్కకు తొలగించి చూశాం. కానీ బుల్లెట్ కనబడలేదు. దాంతో, పేషెంట్ గురించి ఆందోళన ఎక్కువైంది. ఎందుకంటే ఆరు నెలలుగా ఆ బుల్లెట్ ఆమె ఛాతీలో ఇరుక్కుపోయింది. దాన్ని ఎలాగైనా బయటకు తీయాలి" అంటూ చెప్పుకొచ్చారు డాక్టర్ జాహిద్ అలీ షా.

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్‌లో అయూబ్ టీచింగ్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ జాహిద్ షాకు గుండె ఆపరేషన్లు కొత్తేం కాదు.

థొరాసిక్ సర్జరీ విభాగం అధిపతిగా ఎన్నో సర్జరీలు గతంలో చేశారు. అయితే, ఆ మహిళకు చేసిన సర్జరీ మాత్రం ప్రత్యేకమైనది.

ఆరోజు వారి ముందున్న ప్రశ్న.. "ఆ బుల్లెట్ ఎటు వెళ్లిపోయింది?"

బులెట్

బ్లైండ్ బుల్లెట్

పెషావర్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన నాజియా నదీం తన ముగ్గురు బిడ్డలతో, అత్తమామలతో కలిసి జీవిస్తున్నారు. ఆమె భర్త నదీం ఖాన్ అఫ్రిది కరాచీలో ఉద్యోగం చేస్తున్నారు.

"ఫిబ్రవరి నెల చివరి రోజు.. సాయంత్రం మేమంతా మా పెరట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. అకస్మాత్తుగా నా ఛాతీలోకి ఏదో దూసుకెళ్లినట్లు అనిపించింది. అక్కడిక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోయాను."

అత్తమామలు నాజియాను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు సర్జరీ చేశారు.

"నా ఛాతీలో బ్లైండ్ బుల్లెట్ ఉందని, అది ఎక్కడ చిక్కుకుందో తెలీని కారణంగా దాన్ని బయటకు తీయలేమని చెప్పారు. కానీ, రక్రస్రావం ఆగడానికి, ఛాతీకి తగిలిన గాయానికి సర్జరీ చేశారు."

నాజియాకు బుల్లెట్ తగిలిన సమయంలో వాళ్ల ఊర్లో మూడు నాలుగు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. వాళ్లంతా అడపాదడపా టపాసులు కాలుస్తూ, ఆకాశంలోకి తుపాకులు పేలుస్తూ ఉన్నారు.

కాబట్టి, నాజియాకు తగిలిన బుల్లెట్ ఎక్కడినుంచి వచ్చించో ఊహించడం సాధ్యం కాలేదు.

ఆ ప్రాంతంలో పెళ్లి వేడుకలకు ఆకాశంలోకి కాల్పులు జరపడం మామూలేనని, ఆ బుల్లెట్లు తగిలి ఎందరో ప్రాణాలు కోల్పోయారని నాజియా భర్త నదీం ఖాన్ అఫ్రిది తెలిపారు.

"నా భార్య కూడా అలాంటి బుల్లెట్ బాధితురాలే. ఆరునెలల పాటు తీవ్ర వేదన, దుఃఖం అనుభవించాం."

'నొప్పి చంపేసింది'

పెషావర్‌లో ఆపరేషన్ జరిగాక నాజియాకు గుండె, కాలేయ సంబంధ సమస్యలు తలెత్తాయి. మంచం మీంచి లేవలేని పరిస్థితి దాపురించింది.

"నాకు ముగ్గురు పిల్లలు. ఆఖరి బిడ్డకు ఏడాదిన్నర వయసు. నా పిల్లల ఆలనా పాలనా చూసుకోలేకపోయాను. తేలికైన వస్తువులు కూడా ఎత్తలేకపోయేదాన్ని. మంచం మీంచి లేవడమే కష్టంగా ఉండేది."

నొప్పి భరించలేక పెయిన్ కిల్లర్స్ వేసుకునేవారు నాజియా. దాంతో, రోజులో అధికభాగం ఆమెకు మత్తుగా ఉండేది. అలాగే ఆరు నెలలు గడిపారు.

అయితే, ఉమ్మడి కుటుంబం కావడం వలన సభ్యులందరూ ఆమెకు సహకరించేవారు.

"వాళ్లే నా పిల్లలను చూసుకున్నారు. నా చంటిబిడ్డను కూడా ఎత్తుకోలేకపోయేదాన్ని. ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది."

నొప్పి బాగా ఎక్కువైనప్పుడు నాజియా స్పృహ కోల్పోయేవారని నదీం అఫ్రిది చెప్పారు.

"నా ఉద్యోగానికి సెలవు పెట్టి పేషావర్‌లో ఉన్న అందరు డాక్టర్ల దగ్గరకు నా భార్యను తీసుకెళ్లాను. మేము వెళ్లని ఆస్పత్రి అంటూ లేదు. నా భార్యను చెక్ చేసి, బుల్లెట్ ఛాతీలోపల ఎక్కడో చిక్కుకుందని, దాన్ని బయటకు తీయడం సాధ్యం కాదని చెప్పేవారు."

ఇలా జరగడం అసాధారణం కాదని, నొప్పి, బాధ గురించి చేయగలిగింది ఏమీ లేదని డాక్టర్లు చెప్పేవారు.

"ఒక డాక్టరు దగ్గరకెళితే మరో డాక్టరు దగ్గరకు పంపించేవారు. ఫీజులకు, టెస్టులకు, మందులకు కలిపి సుమారు అదారు లక్షలు ఖర్చు పెట్టి ఉంటాం."

నాజియా బాధను చూస్తూ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. పిల్లలు బెంగ పెట్టేసుకున్నారు.

"ఏం చేయాలో నాకు పాలుపోలేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు" అని నదీం అఫ్రిది వివరించారు.

డాక్టర్ జాహిద్ అలీ షా దగ్గరకు...

అప్పుడే నదీంకు అబోటాబాద్‌లోని డాక్టర్ జాహిద్ అలీ షా గురించి తెలిసింది. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు చేయడంలో డాక్టర్ షా చేయి తిరిగినవారని తెలిసింది.

"నా భార్యను అబోటాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడున్న డాక్టర్లు ఆమెను పరీక్షించి మరొక సర్జరీ చేయాలని, కానీ అది చాలా ప్రమాదకరమైనదని చెప్పారు."

అప్పుడే కేసు డాక్టర్ జాహిద్ అలీ షా వరకూ వెళ్లింది.

డాక్టర్ జాహిద్, నాజియాను పరీక్షించారు. బుల్లెట్ గుండె దగ్గరే ఎక్కడో ఉందని, ఆపరేషన్ తీసి తొలగించవచ్చుగానీ, అది చాలా క్లిష్టమైన సర్జరీ అవుతుందని చెప్పారు.

ఇంతకుముందు ఇలాంటి కొన్ని సర్జరీలు చేసి ఉండడం వలన, నాజియా విషయంలో డాక్టర్ జాహిద్ విశ్వాసం వ్యక్తపరిచారు.

"రెండేళ్ల క్రితం ఒక తొమ్మిదేళ్ల అబ్బాయికి కూడా ఇలాటిదే సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ బాబుకు కూడా ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అది నేరుగా బాబు గుండెలోకే గుచ్చుకుందని సర్జరీ చేస్తున్నప్పుడు తెలిసింది" అని డాక్టర్ జాహిద్ వివరించారు.

"నాజియాకు ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు, అది అయిదు గంటలపాటు సాగుతుందని ఊహించలేదు. ఛాతీని తెరిచి చూసిన తరువాత, బుల్లెట్ ఎక్కడ ఉంటుందో ఊహించి సర్జరీ ప్రారంభించాం.

నాజియా గుండెను చేత్తో తాకినప్పుడే బుల్లెట్ గుండెకు అతుక్కుని ఉందని గ్రహించాను. ఎక్స్ రే తీసినప్పుడు గుండెతో పాటూ బుల్లెట్ కూడా పైకి కిందకు కదలడం గమనించాం. ఆరు నెలలుగా గుండెలో బుల్లెట్‌తో ఆమె ఎంతో బాధపడ్డారు. సర్జరీ కోసం ఉపక్రమించి ఛాతీ తెరిచాక ఆమె గురించి చాలా అందోళన కలిగింది.

ఆమె బతికే ఉంది. గుండె కొట్టుకుంటోంది. కానీ ఆమె బ్రతుక్కి, చావుకి మధ్య వెంట్రుకవాసి దూరం మాత్రమే ఉందని తెలుసు. ఆమె అగ్నిపర్వతం అంచున ఉంది."

బులెట్

మూడోసారి విజయం సాధించారు

సర్జరీ చేస్తున్న సమయంలో ప్రముఖ అనస్థటిస్ట్ డాక్టర్ రెహ్మత్ కూడా పక్కనే ఉన్నారని డాక్టర్ జాహిద్ చెప్పారు.

"అల్లాను తలుచుకుని, మెల్లిగా కుడివైపు హృదయకుహరం (వెట్రికల్) వైపుకు జరిగాం. అక్కడే బుల్లెట్ గుండెను అతుక్కుని ఉంది. కార్డియాక్ సర్జన్లు ఒక మెషిన్ ద్వారా రోగి గుండెను నియంత్రిస్తారు. కానీ నా దగ్గర అలాంటి సాధనాలేమీ లేవు. ఆమె గుండె కొట్టుకుంటూ ఉండగానే సర్జరీ చేయాల్సి వచ్చింది. గుండె కొట్టుకుంటున్నప్పుడు అతి చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. అక్కడ చాలా సున్నితమైన సిరలు ఉంటాయి.

రెండుసార్లు బుల్లెట్‌ను సమీపించేందుకు ప్రయత్నించాం. కానీ, అది చిక్కలేదు. మూడోసారి విజయం సాధించాం" అని డాక్టర్ జాహిద్ వివరించారు.

డాక్టర్ జాహిద్ అలీ షా

థొరాసిక్ సర్జన్, హార్ట్ సర్జరీ ఎలా చేశారు?

పాకిస్తాన్ మొత్తంలో 80 లేదా 90 మంది థొరాసిక్ సర్జన్లు ఉంటారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో పదిమందివరకూ ఉంటారని డాక్టర్ జాహిద్ అలీ షా చెప్పారు.

థొరాసిక్ సర్జరీ అంటే ఛాతీ లోపలి అన్ని భాగాలాకు చేసే సర్జరీ. 80 నుంచి 90 శాతం ట్రామా కేసుల్లో థొరాసిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది.

"గతంలో నేను ఆర్థోపెడిక్ సర్జరీలో శిక్షణ పొందాను. కానీ, ఛాతీకి సంబంధించిన సర్జరీల రంగంలో ఎక్కువమంది డాక్టర్ల అవసరం ఉందని గ్రహించి ఇటువైపు వచ్చాను.

"ఒకసారి ఛాతీ తెరిచిన తరువాత, సంబంధిత నిపుణులను పిలుస్తాం. వాళ్లు వచ్చి సర్జరీ చేస్తారు. అయితే, స్పెషలిస్ట్ డాక్టర్లు చాలా తక్కువమంది ఉండడం, అదే సమయంలో వాళ్లు వేరే సర్జరీల్లో ఉండడం జరుగుతుంటుంది."

"నాజియాకు గత మంగళవారం ప్రారంభించిన సర్జరీ, గురువారం వరకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగిందంటే ఈ మధ్యలో గుండెకు సంబంధించిన ఎన్ని విషయాలు నేర్చుకోవాల్సి వచ్చిందో మీరు ఊహించవచ్చు" అని డాక్టర్ జాహిద్ చెప్పారు.

15 క్షణాల భయం.. 20 క్షణాల్లో పరిస్థితి మెరుగుపడింది

ఆపరేషన్ అయిదు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిందని, అయితే, తాను అలిసిపోలేదని.. మధ్యలో కొన్ని నిముషాల పాటు విశ్రాంతి తీసుకున్నానని డాక్టర్ జాహిద్ చెప్పారు.

"బుల్లెట్ తొలగించిన తరువాత రోగి రక్తపోటు 15 సెకెండ్ల పాటూ పూర్తిగా పడిపోయింది. అప్పుడు ఒక పెద్ద సంచీడు రక్తం బయటకు పొంగింది. ఆ 15 సెకెండ్లు అత్యంత ప్రమాదకరమైన క్షణాలు.

గుండె కొట్టుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. తరువాత మరో 20 సెకెండ్లకు రోగి పరిస్థితి మెరుగుపడింది. ఆరునెలల పాటు గుండెలో బుల్లెట్‌తో బాధపడిన ఆమె ప్రాణం నిలబడిందని ఊపిరి పీల్చుకున్నాం" అని డాక్టర్ జాహిద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
It is not known where the bullet landed in her chest ,The operation was performed and taken out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X