బ్రిటన్ కొత్త ప్రధానిగా..: టాప్ ప్రయారిటీస్ ఇవే: మూర్తిగారి అల్లుడికి నిరాశే..!!
లండన్: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి ఎవరనేది తేలిపోయింది. అధికార కన్జర్వేటివ్ పార్టీ కొద్దిసేపటి కిందటే కొత్త ప్రధాని పేరును ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వారసులెవరనేది తేల్చేసింది. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి, కేబినెట్ సహచరుడు రుషి సునాక్‌ను ఆమె ఓడించారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆమె విదేశాంగ శాఖ మంత్రి. రిషి సునాక్.. ఆర్థిక శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించారు. లిజ్ ట్రస్‌కు మొత్తంగా 81,326 ఓట్లు పోల్ అయ్యాయి. రిషి సునాక్‌కు పడిన ఓట్ల సంఖ్య 60,399 మాత్రమే. ఫలితాలు ప్రకటించే సమయానికి లిజ్ ట్రస్.. రిషి సునాక్ ఒకేచోట ఉన్నారు. లిజ్ ట్రస్ పేరును ప్రకటించిన వెంటనే రిషి సునాక్ ఆమెను అభినందించారు.

20,987 ఓట్ల తేడాతో..
లిజ్ ట్రస్‌కు మొత్తంగా 81,326 ఓట్లు పోల్ అయ్యాయి. రిషి సునాక్‌కు పడిన ఓట్ల సంఖ్య 60,399 మాత్రమే. 20,987 ఓట్ల తేడాతో ఆమె రిషి సునాక్‌ను ఓడించారు. సెంట్రల్ లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్ 2 సెంటర్‌లో ఎన్నికల ఫలితాలను వెల్లడించారు కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధులు. ఫలితాలు ప్రకటించే సమయానికి లిజ్ ట్రస్.. రిషి సునాక్ ఒకేచోట ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ ఛైర్మన్ ఆండ్రూ స్టీఫెన్సన్, సర్ గ్రాహమ్ బ్రాడీ ఈ ఫలితాలను వెల్లడించారు. లిజ్ ట్రస్ పేరును ప్రకటించిన వెంటనే రిషి సునాక్ ఆమెను అభినందించారు.

జాబ్ ఇంటర్వ్యూగా..
బోరిస్ జాన్సన్ కేబినెట్ మంత్రులతో పాటు కన్జర్వేటివ్ పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. లిజ్ ట్రస్‌ను అభినందనలతో ముంచెత్తారు. అనంతరం మాట్లాడారు. తన ప్రాధాన్యతల గురించి వివరించారు. బ్రిటన్ ప్రధానిగా తన ఎన్నిక- చరిత్రలోనే ఓ సుదీర్ఘమైన జాబ్ ఇంటర్వ్యూగా అభివర్ణించారు. ఈ ఇంటర్వ్యూ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంత శక్తిమంతమైనదో దీని ద్వారా మరోసారి తేలిందని పేర్కొన్నారు.

ఆర్థిక రంగం బలోపేతం..
ఎన్నికల ప్రచార సమయం, టీవీ డిబేట్లల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని లిజ్ ట్రస్ చెప్పారు. వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తానని అన్నారు. పన్నులు తగ్గింపు, ఆర్థిక రంగానికి మరింత ఊతం ఇచ్చే విధానాలను అమలు చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి సమగ్ర ప్రణాళికలను రూపొందించుకున్నామని, వాటిని అంతే సమర్థవంతంగా అమలు చేస్తానని అన్నారు.

2024 ఎన్నికల్లో..
ఇంధన సరఫరాపై దీర్ఘకాలిక ప్రణాళికలను అనుసరించాల్సిన అవసరం ఏర్పడిందని లిజ్ ట్రస్ వ్యాఖ్యానించారు. అలాంటి ప్రణాళికలను అమలు చేస్తానని చెప్పారు. నేషనల్ హెల్త్ సర్వీస్‌ను పకడ్బందిగా అమలు చేస్తానని, తన మలి ప్రాధాన్యత ఇదేనని పేర్కొన్నారు. డెలివరీ సిస్టమ్‌ను అనుక్షణం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆయా దీర్ఘకాలిక ప్రణాళికలతోనే 2024 ఎన్నికలను ఎదుర్కొంటామని, గొప్ప విజయాన్ని సాధిస్తామని లిజ్ ట్రస్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications