GPS Girl: గూగుల్ మ్యాప్స్ లో మీరు వింటున్న వాయిస్ ఈమెదే..! ఎన్ని ప్రత్యేకతలో..
మీరు ఏదైనా ఊరు వెళ్లాలని అనుకున్నారు. ఆ ఊరికి దారి కచ్చితంగా తెలియదు. ఫలానా జిల్లానో, లేదా నగరమో మాత్రమే తెలుసు. అప్పుడు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని కచ్చితమైన లొకేషన్, దారి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేయగానే మీకో సుమధుర స్వయం ఇంగ్లీష్ లో వినిపిస్తుంటుంది. మీరు ఎక్కడికి వెళ్లాలో దారి పొడవునా సూచనలు ఇస్తూనే ఉంటుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్.. ఇలా అలసిపోకుండా చెప్పుకుంటూనే వెళ్తుంది. చివరికి మీ గమ్యస్ధానానికి చేర్చేస్తుంది. అయితే మన గమ్యం చేరగానే అప్పటివరకూ వినిపించిన స్వరాన్ని మర్చిపోతాం.
తెరపై ఒక్కసారి కూడా కనిపించకుండానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాహన డ్రైవర్లకు గూగుల్ మ్యాప్స్ లో దారి చూపిస్తూ సాయ పడుతున్న ఆమె పేరు తెలుసా ? కరెన్ జాకబ్ సన్. ఆస్ట్రేలియాలో పుట్టిన కరెన్.. ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత జీపీఎస్ గర్ల్ గా మారిపోయారు. ఏడేళ్ల వయసు నుంచే పాటలు రాస్తున్న కరెన్.. ప్రఖ్యాత సింగర్ ఒలివియా న్యూటన్-జాన్ సూచనతో ప్రొఫెషనల్ గా మారారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ కన్జర్వేటోరియం గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుండి వాయిస్, పియానోలో డిగ్రీ పట్టా తీసుకున్నారు.

గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియాతో సహా ఆస్ట్రేలియన్ టెలివిజన్‌లో వరుసగా ప్రదర్శనలు ఇచ్చిన కరెన్ కు ఆన్ లైన్లో లక్షలాది మంది అభిమానులున్నారు. న్యూయార్క్ కు వలస వెళ్లాక పాటలు రాయడం, పాడటం చేసేది. అమెరికాలో ప్రఖ్యాత గాయకులు, గ్రామీ అవార్డు విజేతలతో కలిసి పాటలు పాడిన కరెన్ మధ్యలో గూగుల్ మ్యాప్స్ వాయిస్ అసిస్టెంట్ కోసం తన స్వరాన్ని కూడా ఇచ్చింది. దీంతో జీపీఎస్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. ఎప్పుడో 2002లో ఆమె ఇచ్చిన ఆ స్వరం ఇప్పటికీ గూగుల్ వాడుతోందంటే అదెంత పాపులరో అర్ధం చేసుకోవచ్చు.
ఐఫోన్, ఐప్యాడ్ లలో వినిపించే సిరి వాయిస్ తో పాటు గూగుల్ మ్యాప్స్, పలు జీపీఎస్ పరికరాలకు కరెన్ ఇచ్చిన వాయిస్ చాలా ప్రాచుర్యం పొందింది. వివిధ దేశాల్లో ఎన్నో పాటలు రాయడం, పాడటం కరెన్ ను అంతర్జాతీయ కళాకారిణిగా మార్చేసింది. 2020లో దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత కోవిడ్ కారణంగా తన స్వదేశం ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయిన కరెన్ జాకబ్ సన్.. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. కరెన్ కేవలం గాయని, స్వరకర్త మాత్రమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుంటుంది. దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాల కోసం కరెన్ పాటలు పాడింది.












Click it and Unblock the Notifications