Bangladesh: నేడు తాత్కాలిక ప్రధాని యూనస్ బాధ్యతలు-భారత్ లోకి చొరబాట్లు-బీఎస్ఎఫ్ ఫైరింగ్..!
బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న భారీ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చేసిన షేక్ హసీనా, ఆమె సోదరి రెహనాతో కలిసి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో పరిస్ధితుల్ని అదుపులోకి తెచ్చేందుకు అక్కడ సైన్యం, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ ఇవాళ పారిస్ నుంచి ఢాకా వచ్చి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరోవైపు భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.
నెల రోజులుగా ఘర్షణలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఓవైపు సైన్యం, మరోవైపు జైలు నుంచి విడుదలైన మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా, ఇంకోవైపు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మొహమ్మద్ యూనిస్ కూడా ప్రజల్ని శాంతియుతంగా ఉండాలని కోరుతున్నారు. ఇప్పటికీ బంగ్లాదేశ్ లో మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీలీగ్ నేతలపై దాడులు, హత్యలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని అదుపులోకి తీసుకురావడం తాత్కాలిక ప్రభుత్వానికి పెను సవాలుగా మారనుంది.

మరోవైపు బంగ్లాదేశ్ లో తాజా ఘర్షణలు, దాడులు, హత్యలతో భయబ్రాంతులకు గురవుతున్న అక్కడి ప్రజలు భారత్ లోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సరిహద్దుల వద్ద గుంపులు గుంపులుగా చేరుకుంటున్నారు. దీంతో మన సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) వారిపై కాల్పులు జరిపి చెదరగొడుతోంది. అయితే బంగ్లాదేశ్ లో ఓసారి ప్రభుత్వం ఏర్పాటై శాంతియుత పరిస్ధితులు నెలకుంటే ఆటోమేటిగ్గా ఈ చొరబాట్లు తగ్గిపోతాయని భారత్ భావిస్తోంది. దీంతో బంగ్లాదేశ్ పౌరుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.













Click it and Unblock the Notifications