ట్రంప్ పై అభిశంసన తీర్మానం.. ఎలాన్ మస్క్ సంచలన పిలుపు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొన్నటివరకు చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఇద్దరూ.. ఇప్పుడు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టాలా ? వద్దా ? అని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ పోలింగ్ కు ఎలాన్ మస్క్ YES అని సమాధానం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరువురి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లుగా భావించవచ్చు.
స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ సెనేట్ లో అభిశంసన తీర్మానం తీసుకురావాలని మస్క్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టాలన్న పోస్టుకు మస్క్ మద్దతు ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
"ట్రంప్ ను అభిశంసించాలి, ఆయన స్థానంలో జేడీ వాన్ ను నియమించాలి" అని సామాజిక మాధ్యమంలో వచ్చిన పోస్టును మస్క్.. తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అంతేకాక ఈ ప్రశ్నకు "అవును" అని కూడా జత చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో కూడా అభిశంసనను ఎదుర్కొన్నారు. ఆయన మొదటి పదవీకాలంలో డెమోక్రాట్లు ఆయనపై అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ అది సభలో వీగిపోయింది.

నిజానికి 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున ఎలాన్ మస్క్ ప్రచారం నిర్వహించారు. ట్రంప్ కు మద్దతుగా బహిరంగ సభలు పెట్టారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించడంలో మస్క్ కృషి ఉంది. మస్క్ సేవలుగా ప్రతిగా డొనాల్డ్ ట్రంప్.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ బాధ్యతలను ఎలాన్ మస్క్ కు అప్పగించారు.
అయితే ట్రంప్ ఇటీవల కాలంలో తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు, ఏకపక్ష ధోరణి, ది బిగ్ అండ్ బ్యూటిపుల్ బిల్లు తీసుకురావడం ఎలాన్ మస్క్ కు నచ్చలేదు. ఈ క్రమంలో మస్క్.. తాను నేతృత్వం వహిస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) వ్యవస్థ నుంచి వైదొలిగారు. అంతేకాక ట్రంప్ తీసుకొచ్చిన "బిగ్ బ్యూటిపుల్ బిల్" తన ఆదేశాలకు విరుద్ధంగా ఉందని, ఇది అమెరికా రుణాన్ని తగ్గిస్తుందనుకుంటే అది మరింత పెంచుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ..మస్క్ తన బడ్జెట్ బిల్లును విమర్శించినందుకు తాను నిరాశ చెందినట్లు చెందినట్లు తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య సత్సంబంధాలు మరింత క్షీణించాయి.
ఇక ట్రంప్ మొదటి పదవీకాలం అయిన 2017- 2021 మధ్య రెండుసార్లు ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టారు. అయితే రెండు సార్లూ ఆయన నిర్దోషిగానే బయటకు వచ్చారు. ఇక మొత్తానికి, ఎలాన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతున్న ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications