GLOF: హిమ సరస్సు మళ్లీ బద్దలు- ఈ సారి ఆ దేశానికి ముంచుకొచ్చింది.. !!
నేపాల్‌ను ప్రకృతి వైపరీత్యాలు వణికిస్తోన్నాయి. ఇప్పటికే భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అతలాకుతలమైన ఆ దేశంలో తాజాగా సంభవించిన భూకంపం ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టినట్టయింది. ఏ క్షణంలో ఏ ఉత్పాతం విరుచుకుపడుతుందోననే భయాందోళనలు అలముకున్నాయి. ఈ భూకంపం వల్ల తక్షణ నష్టం ఏదీ సంభవించనప్పటికీ.. భోటేకోశి నదిపై కొత్తగా ఏర్పడిన కృత్రిమ సరస్సు ఎప్పుడైనా పగిలిపోయే ప్రమాదం ఏర్పడింది.
ఆ ప్రమాదమే ఇప్పుడు ముంచుకొచ్చింది. నేపాల్- టిబెట్ స్వయంప్రతిపత్తి కలిగిన సరిహద్దు ప్రాంతంలో మరో కృత్రిమ జలాశయం బద్దలైంది. దాదాపు 30 లక్షల క్యూసెక్కులు టిబెట్ వైపు పోటెత్తుతోంది. నేపాల్ ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా. తాజా అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. బురదలో చిక్కుకున్న బాధితుల కోసం అన్వేషిస్తున్న రెస్క్యూ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

అదే సమయంలో నేపాల్ పోలీస్ విభాగం కూడా ఓ అలర్ట్ ను ఇష్యూ చేసింది. త్రిశూలి, భొటేకోశి నదుల్లో మళ్లీ వరద ప్రవాహం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న సైన్యం, భద్రతా సిబ్బంది, స్థానిక ప్రజలు ఇప్పటికిప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. భోటేకోశి నది ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉన్నందున నదీ తీర ప్రజలను తక్షణమే ఖాళీ చేయిస్తోన్నారు కూడా.
ఈ తాజా జల విస్ఫోటనానికి కారణాలపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందక్కడి ప్రభుత్వం. టిబెట్ ఎగువ పర్వత ప్రాంతాలలో ఉన్న భారీ హిమానీనది సరస్సు (గ్లేసియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ - GLOF) తెగడం వల్లే తాజా వరద ఏర్పడినట్లు తేల్చింది. దీంతో పాటు ఊహించని స్థాయిలో కొండచరియలు, హిమపాతం విరిగిపడటమే దీనికి ప్రధాన కారణమని భావిస్తోంది. దీనివల్ల భోటేకోశి నదిలోకి ఒక్కసారిగా భారీ స్థాయిలో నీటి ప్రవాహం పెరుగుతుందని అంచనా వేసింది.
Alert !! pic.twitter.com/grYxhc5N7Q
— Nepal Police (@NepalPoliceHQ) August 28, 2026
ఈ నెల 26న సంభవించిన వరదల్లో మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొండచరియలు, బురద కుప్పల కింద చిక్కుకున్న పలువురు మరణించారు. ఇప్పటివరకు అందిన గణాంకాల ప్రకారం నేపాల్ లో మరణించిన వారి సంఖ్య 469 కి చేరుకుంది. ఇది మరింత పెరగొచ్చు కూడా. దాదాపు 1,500 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ జాడ లేకుండా పోయారు. దీని నుంచి తేరుకోకముందే మళ్లీ గ్లేసియర్ లేక్ అవుేట్ బరస్ట్ కావడం ఆందోళనకు దారి తీసింది.













Click it and Unblock the Notifications