Nepal Floods: 1,250 దాటిన మృతుల సంఖ్య.. ఇంకా లభ్యం కాని 4,800 మంది ఆచూకీ
నేపాల్ లో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకూ 1,252 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గాలింపు చర్యలు వేగవంతం చేస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. వరదలు సంభవించిన 9 రోజులు గడిచినా ఇంకా 4,800 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. నేపాల్ పోలీసులు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. చిత్వాన్ జిల్లాలో 355 మందికిపైగా మృత దేహాలు లభ్యం అయ్యాయి. అలాగే నవాల్ పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 కు పైగా మృత దేహాలు బయటపడ్డాయి. ఇక నవాల్ పరాసీ వెస్ట్ జిల్లాలో మరో 208 కు పైగా మృత దేహాలు లభ్యం అయినట్లు పోలీసులు వెల్లడించారు.
రసువా జిల్లాలో 127 కు పైగా మృత దేహాలు, నువాకోట్ జిల్లాలో 177 కు పైగా మృత దేహాలు లభ్యం అయ్యాయి. అలాగే 69 కు పైగా మృత దేహాలు గోర్ఖా జిల్లాలో లభ్యం కాగా ధాడింగ్ జిల్లాలో 60, తహాను జిల్లాలో 38 కు పైగా మృత దేహాలను వెలికి తీసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. నేపాల్ పోలీసులు, నేపాల్ ఆర్మీ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. 9 రోజులు గడుస్తున్నా ఇంకా 4,875 మందికి పైగా గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ సహాయక చర్యల్లో 11,993 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు. ఇక వరద బీభత్సం ధాటికి గుర్తుపట్ట లేనంతగా మారిన మృత దేహాలను డీఎన్ఏ పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు. నిర్ధారించిన వారిని సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.

మరోవైపు నేపాల్ వరదల్లో తెలంగాణకు చెందిన ఎన్ ఆర్ ఐ కుటుంబం గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ఈ వరదల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీధర్, ఆయన భార్య దీప్తి, కుమారుడు అభినవ్ గల్లంతయ్యారు. గత నెల 13న ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు శ్రీధర్ కుటుంబం వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం యూకే నుంచి వచ్చి తెల్లాపూర్ లో నివాసం ఉంటున్నారని తెలిపారు. ఇక నేపాల్ వరదల నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతంలో ఉన్న సిక్కింలో అధికారులు అప్రమత్తం అయ్యారు. సిక్కింలో చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 400కు పైగా గ్లేసియర్ సరస్సులు ఉన్నాయి. వీటిలో 16 సరస్సులను అత్యంత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నవిగా గుర్తించినట్లు అధికారులు స్పష్టం చేశారు. వాటిలో 13 ఉత్తర సిక్కింలో ఉండగా.. మరో మూడు పశ్చిమ సిక్కింలో ఉన్నట్లు వివరించారు. నేపాల్ వరదల నేపథ్యంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సులపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది.












Click it and Unblock the Notifications