ఆ సినిమా స్ఫూర్తితో బ్యాంకు దోపిడీ.. రూ. 316 కోట్లతో జంప్..
జర్మనీలోని బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకుకు భారీ రంధ్రం పెట్టి నగదు, బంగారం ఇలా మొత్తం 30 మిలియన్ యూరోల విలువైన నగదును దోచుకెళ్లారు. భారత కరెన్సీలో ఆ విలువ రూ. 316 కోట్లుగా ఉంది. ఈ ఘటన జర్మనీలోని వెస్టర్న్ సిటీ అయిన గెల్సెన్ కిర్చెన్ నగరంలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగింది.
బ్యాంకులోని వాల్ట్ రూమ్ కు పెద్దగా డ్రిల్ చేసి లోపలికి వెళ్లిన దొంగలు దాదాపు 3 వేలకు పైగా డిపాజిట్ బాక్సులను బద్దలుకొట్టి రూ. 316 కోట్ల విలువైన నగదుతో పరారైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. బ్యాంకులోని సీసీ కెమెరాల ప్రకారం.. మాస్కులు ధరించిన దుండగులు బ్యాంకులోని పార్కింగ్ గార్బేజ్ నుంచి బ్లాక్ కలర్ ఆడీ కారులో జంప్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలించిన పోలీసులు బ్లాక్ ఆడీ కారుకు గతంలో హానోవర్ అనే నగరంలో కొట్టేసిన నంబర్ ప్లేటును పెట్టినట్లు గుర్తించారు. ఇదే ఘటనపై ప్రత్యక్ష సాక్షులు కూడా పలు విషయాలు తెలిపారు. బ్యాంకు గార్బేజ్ ఏరియా నుంచి పెద్ద పెద్ద బ్యాగులతో కొందరు వ్యక్తులు బయటకు రావడం గమనించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. వీకెండ్ దృష్ట్యా నిందితులు సిటీ దాటి బయటకు వెళ్లే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటన తెలిసిన వెంటనే వందలాది మంది కస్టమర్లు వచ్చి బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో బ్యాంకు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బ్యాంకు బిల్డింగ్ ను ముట్టడించకుండా అడ్డుకున్నారు. ఇదే విషయంపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. దుండగులు చాలా ప్రొఫెషనల్ గా ఈ దోపిడీ చేశారని అన్నారు. హాలీవుడ్ మూవీ అయిన 'ఓషియన్ ఎలెవన్' లో దోపిడీ సీన్ ను రిపీట్ చేశారని తెలిపారు. దీన్ని జర్మనీ బ్యాంకు హిస్టరీలోనే అతిపెద్ద దోపిడీగా అభివర్ణించారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications