గాజాపై మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 33 మంది మృతి !
గాజా-ఇజ్రాయెల్ ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. అక్టోబర్ 11 నుంచి కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ వరుస దాడులు కొనసాగిస్తోంది. గురువారం ఖాన్ యూనిస్ నగరంపై జరిగిన బాంబుదాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకటించింది. సీజ్‌ఫైర్ తర్వాత ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడులలో 211 మంది మరణించగా.. 597 మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందం కేవలం పేరుకే ఉందని గాజా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాజా-ఖాన్ యూనిస్‌పై క్షిపణుల వర్షం..
కాగా వార్తా సంస్థ అల్ జజీరా ప్రకారం ఇజ్రాయెల్ రాత్రి వేళల్లో గాజా, ఖాన్ యూనిస్ నగరాలను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో వైమానిక దాడులు (Israeli Airstrikes) చేసింది. ఈ దాడుల్లో కనీసం 25 మంది మరణించగా, 77 మందికి పైగా గాయపడ్డారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతాలను, మార్కెట్లను, శరణార్థి బస్తీలను టార్గెట్ చేసుకొని ఐడిఎఫ్ దాడులు జరపడంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అల్ జజీరా వెల్లడించింది.

మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం తమ దాడులు హమాస్ తీవ్రవాదుల మౌలిక వసతులపైనే జరిపినవని ప్రకటించింది. గాజా నుంచి మా భూభాగంపై మళ్లీ దాడులు జరగకుండా ముందస్తు చర్యలు తప్పవని ఐడీఏఫ్ పేర్కొంది. గాజా మాత్రమే కాకుండా, సరిహద్దు దేశమైన లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరాలపై కూడా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ ఆరోగ్య శాఖ ధృవీకరించిందని అల్ జజీరా నివేదించింది.
ఇజ్రాయెల్ ప్రకటన ప్రకారం.. హమాస్, హెజ్‌బొల్లా నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ వైమానిక, డ్రోన్ దాడులు చేపట్టినట్లు తెలిపింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగి, ఘర్షణలు విస్తరించే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అమెరికా పర్యవేక్షణలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం పూర్తిగా అమలు కానట్లే కనిపిస్తోంది. అంతర్జాతీయ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు సీజ్‌ఫైర్ ఉల్లంఘనపై ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే నిరంతర యుద్ధ వాతావరణంలో జీవిస్తున్న గాజా ప్రజలు మళ్లీ గృహం కోల్పోయి, ఆశ్రయం కోసం తరలిపోతున్నారు. నీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు తక్కువై జీవనోపాధి కఠినమైందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications