రష్యాకు హ్యాండిచ్చిన పాకిస్తాన్-యుద్ధాన్ని తప్పుబట్టిన ఆర్మీఛీఫ్-వెళ్లే ముందు ఇమ్రాన్ కు షాక్
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభమైన రోజే రష్యాకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన ప్రభుత్వం ఇప్పటికీ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని సమర్ధిస్తూనే ఉంది. అయితే ఇప్పటికే పదవీగండం ఎదుర్కొంటున్న ఇమ్రాన్ వైఖరికి భిన్నంగా పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వా ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వా ఇవాళ ఖండించారు. రష్యాకు భద్రతా సమస్యలు ఎన్నైనా ఉండొచ్చని, కానీ ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై దాడి చేయడం మంచిది కాదని బజ్వా తెలిపారు. అంతే కాదు రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపేయాలని ఆయన సూచించారు. ఇస్లామాబాద్ లో ఇవాళ ప్రారంభమైన భద్రతా భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా బజ్వా చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా చర్చ జరుగుతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించిన బజ్వా.. చర్చల ద్వారా ఇరుదేశాలూ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటికే వేలాది మంది అమాయక పౌరులు చనిపోయారని, ఇకనైనా యుద్ధాన్ని ఆపాలని జనరల్ బజ్వా కోరారు. అలాగే రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్ పైనా ఆయన ప్రశంసలు కురిపించారు. తమను తాము కాపాడుకునే సామర్ధ్యం చిన్న దేశాలకు కూడా ఉందని ఇక్కడ నిరూపణ అయిందంటూ పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వా వ్యాఖ్యానించారు.
రష్యాతో పాకిస్తాన్ బంధం బలహీనంగానే ఉందని, ఈ మధ్య మాత్రం కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేక వైఖరితో పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇమ్రాన్ ప్రభుత్వానికి కాలం తీరిపోయినట్లు ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications