ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి, 70 మందికిపైగా సీరియస్
పాకిస్థాన్ లో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 16 మంది మృతి చెందారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్, సింధ్ ప్రావిన్స్ లలో జరిగిన ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రావిన్స్ లోని సర్దార్ గర్హ్ ప్రాంతంలో పెళ్లివారితో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను మితిమీరిన వేగంతో వస్తున్న ఓ ట్రైలర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదే ఘటనను పంజాబ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రెస్క్యూ 1122 అధికార ప్రతినిధి మహమ్మద్ ఫరూఖ్ ధ్రువీకరించారు. గాయపడిన వారిని షేక్ జాయేద్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అలాగే రహీమ్ యార్ ఖాన్ లోని మియాన్ వాలీ ఖురేషియన్ హాస్పిటల్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు ప్రమాదం రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో జరిగిందని.. ఘటనా ప్రాంతం లాహోర్ కు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

మరో రోడ్డు ప్రమాదం సింధ్ ప్రావిన్స్ లోని జాకోబాబాద్ జిల్లాలోని థాల్ సిటీలో జరిగింది. లాహోర్ కు వెళ్తున్న ఓ బస్సు అధిక వేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక బస్సులో ఉన్న మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
