Video: పాక్ ఆర్మీ ఆఫీసర్ దాష్టీకం. క్యాంపస్‌లో విద్యార్థులపై కాల్పులు
ఇది పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని 'సర్హద్' విశ్వవిద్యాలయ ప్రాంగణం. తరగతుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, పెంచిన ఫీజులు, హెచ్ఓడీల పనితీరుకు నిరసనగా రోజువారీగా విద్యార్థులు ప్రశాంతంగా ధర్నా చేస్తున్నారు. ఆ సమయంలో నిరసనకారులను అడ్డుకునే క్రమంలో స్టూడెంట్ అఫైర్స్ హెడ్ డ్రాక్టర్ ఆయినాకు, విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. వివాదం పెద్దది కావడంతో సదరు మహిళా అధికారి నేరుగా తన భర్తకు ఫోన్ చేసింది. అంతే, కథ అక్కడే అడ్డం తిరిగింది
పిలుపు వచ్చిందే తడవుగా ఆమె భర్త, పాకిస్థాన్ ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ అస్ఫంద్యార్ వలీ నేరుగా విశ్వవిద్యాలయానికి చేరుకున్నాడు. నిబంధనలను పక్కనపెట్టి ఆర్మీ యూనిఫామ్‌లోనే, చేతిలో సర్వీస్ రివాల్వర్‌తో ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఉన్న శాంతియుత విద్యార్థులపై ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించాడు.

హడలెత్తించిన తుపాకీ శబ్దాలు.. కల్నల్‌ను చుట్టుముట్టిన విద్యార్థులు!
ఆర్మీ అధికారి అకారణంగా దాడి చేయడంతో ఆగ్రహించిన విద్యార్థులు అతడిని చుట్టుముట్టారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ అధికారి తన తుపాకీ తీసి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆయుధాల్లేని విద్యార్థుల వైపు తుపాకీ గురిపెట్టి బెదిరింపులకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్థాన్‌లో తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. "పైఅధికారులు వచ్చేవరకు ఈ సైనిక అధికారిని బయటకు పోనివ్వం" అంటూ విద్యార్థులు క్యాంపస్‌లోనే ఆందోళన చేపట్టారు.
A Pakistani Army officer (reportedly a Colonel) opened fire into the air at Sarhad University’s campus today amid a student protest.
— Khaleej Mag (@KhaleejMag) August 24, 2026
The officer, husband of faculty member, arrived after a confrontation involving students. He allegedly struck a student with a stick; a scuffle… pic.twitter.com/1iI7wkYRXg
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సివిల్ వర్సిటీపై సైనిక ప్రతాపం చూపడంపై పాకిస్థాన్ మీడియా ప్రముఖులు, విశ్లేషకులు మండిపడుతున్నారు. "దేశంలో సైన్యం అనేది చట్టానికి అతీతంగా వ్యవహరించడం మొదలుపెడితే ఇలాగే జరుగుతుంది" అని ప్రముఖ విశ్లేషకురాలు ఆయేషా సిద్ధిఖా విమర్శించారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో కాల్పులు జరపడానికి సైనికులకు ఎవరు అధికారం ఇచ్చారని విలేకరులు ప్రశ్నిస్తున్నారు.
సైనిక విచారణకు ఆదేశం.. కస్టడీలోకి ఆర్మీ ఆఫీసర్!
ఈ ఘటనతో సైన్యం ఇమేజ్ తీవ్రంగా దెబ్బతినడంతో పాకిస్థాన్ ఆర్మీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశిస్తూ సదరు కల్నల్‌ను సైనిక కస్టడీలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. సైనిక నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువైతే క్రమశిక్షణా చర్యలు తప్పవని వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం సామాన్యులపై చేస్తున్న దాష్టీకాలపై నిరసనలు వ్యక్తమవుతుండగా, ఈ ఘటన మంటలకు మరింత ఆజ్యం పోసింది.














Click it and Unblock the Notifications