భారత్ వాదనకు పాక్ బహిరంగ మద్దతు..! ట్రంప్ కు బిగ్ షాక్..!
కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నాలుగు రోజుల పాటు జోరుగా సాగుతున్న క్రమంలో ఉన్నట్లుండి పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు కేంద్రం కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో భారత్-పాక్ మధ్య యుద్దం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే తాను జోక్యం చేసుకుని ఇరుదేశాల్నీ వాణిజ్య చర్చల పేరు చెప్పి ఒప్పించడం వల్లే కాల్పుల విరమణ జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పటి నుంచీ చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ భారత్ మాత్రం ఈ వాదనను అంగీకరించడం లేదు.
భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ వెనుక మిలిటరీ డైరెక్టర్ జనరల్స్ చర్చలు మాత్రమే ఉన్నాయని కేంద్రం ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. అయితే ట్రంప్ మాత్రం దీనికి అంగీకరించకుండా తానే భారత్-పాక్ యుద్దం ఆపానని పదే పదే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి కూడా అయిన ఇషాక్ దార్ కీలక ప్రకటన చేశారు. అందులో ట్రంప్ కు ఆయన భారీ షాక్ ఇచ్చారు.

భారతదేశం రెండు దేశాల మధ్య సమస్యలపై మూడవ పక్షం మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ అంగీకరించలేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇవాళ బహిరంగంగా అంగీకరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తన జోక్యంతో కాల్పుల విరమణను కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనకు దీంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే భారత్ చేస్తున్న వాదనకు పాకిస్తాన్ కూడా మద్దతిచ్చినట్లయింది.
అమెరికా గతంలో మే నెలలో కాల్పుల విరమణ ప్రతిపాదనను తెలియజేసిందని, భారతదేశం, పాకిస్తాన్ మధ్య తటస్థ వేదిక వద్ద చర్చలు జరపాలని సూచించిందని ఇషాక్ దార్ తెలిపారు. కానీ వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియోతో జరిగిన తదుపరి సమావేశంలో, భారతదేశం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని దార్ తెలిపారు. మే 10న కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చినప్పుడు భారత్, పాక్ మధ్య చర్చలు త్వరలో ఒక స్వతంత్ర ప్రదేశంలో జరుగుతాయని రూబియో తనకు చెప్పారన్నారు. జూలై 25న తాను దాని గురించి అతనిని అడిగితే భారతదేశం ఇది ద్వైపాక్షిక సమస్య అని పట్టుబడుతుందని ఆయన చెప్పేశారన్నారు.

అయితే తాము మూడవ పక్షం ప్రమేయాన్ని వ్యతిరేకించడం లేదని, కానీ భారత్ మాత్రం ఇది ద్వైపాక్షిక అంశమని స్పష్టంగా చెబుతోందని ఇషాక్ దార్ తెలిపారు. అయితే ద్వైపాక్షిక చర్చలకు తమకు అభ్యంతరం లేదని, కానీ చర్చలు సమగ్రంగా ఉండాలన్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, జమ్మూ-కాశ్మీర్ ఇలా గతంలో తాము చర్చించిన అన్ని అంశాలపై ఇవి ఉండాలన్నారు. భారత్ స్పందిస్తే పాకిస్తాన్ ఇప్పటికీ చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications