ఆఫ్ఘనిస్థాన్‌లో భారత నిర్మాణాలు, ఆస్తులను ధ్వంసం చేయండి: తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు
కాబూల్: అమెరికా, నాటో దళాలు ఉపసంహరణతో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అనేక ప్రాంతాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు జరుపుతున్నారు. అంతేగాక, పాకిస్థాన్ ఏం చెబితే అది చేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారు.
పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం, ఆ దేశ నిఘా సంస్థ(ఐఎస్ఐ) ఆదేశాల మేరకు ఆఫ్ఘనిస్థాన్‌లో దాడులకు పాల్పడుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో భారత్ చేపట్టిన నిర్మాణాలే లక్ష్యంగా దాడులు చేయాలని తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాలిబన్లు, పాకిస్థాన్ ఉగ్రవాదులు కలిసి ఆఫ్గానిస్థాన్‌లో భారత ఆస్తుల ధ్వంసం లక్ష్యంగా పనిచేస్తున్నాయని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గతంలో ఉగ్రవాదుల దాడుల్లో తీవ్రంగా విధ్వంసానికి గురైన ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణంలో భారత్ ఎంతగానో సాయపడింది. పార్లమెంటు సహా అనేక పరిపాలన భవనాలు, ప్రాజెక్టులను నిర్మించింది. ఇంకా పలు నిర్మాణాలను చేపడుతోంది. అయితే, ఇప్పుడు ఈ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలంటూ తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
కాగా, గడిచిన రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మానం కోసం భారతదేశం 3 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. భారత సహకారంతో నిర్మించిన వాటిలో ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంటు భవనం, ఇండియా-ఆఫ్ఘనిస్థాన్ ఫ్రెండ్‌షిప్ డ్యామ్(సల్మా డ్యామ్), జారంజ్, డెలారామ్ మధ్య ఉన్న 218 కిలోమీటర్ల రోడ్డు చాలా ముఖ్యమైనవి. ఆఫ్ఘనిస్థాన్‌లో విద్యాభివృద్ధికి కూడా భారత్ విశేషంగా సేవలందించింది.
Recommended Video
అంతేగాక, 350 మిలియన్ డాలర్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఇటీవలే భారత ప్రభుత్వం ప్రకటించింది. కాబూల్ నగరానికి తాగునీటి సదుపాయాలు కల్పించే ప్రాజెక్టు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్థాన్.. భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఈ దాడులకు పాల్పడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు భారత రాయబార కార్యాలయ అధికారులను స్వదేశానికి రప్పించిన భారత్.. మిగిలిన అధికారులు, పౌరులు, కార్మికులను కూడా తిరిగి రప్పించాలనే యోచనలో భారత్ ఉంది.












Click it and Unblock the Notifications