పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు అల్టిమేట్ పవర్స్: సర్వశక్తిమంతుడు: భారత్ కు సవాళ్లు
పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ దేశ త్రివిధ దళాల అధిపతుల కంటే అత్యంత శక్తిమంతమైన సర్వాధికారాలు ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేతికి చిక్కాయి. ఈ మేరకు పాకిస్తాన్ పార్లమెంట్ ఓ నూతన డిఫెన్స్ యాక్ట్ ను ఆమోదించింది. ఈ చట్టం ద్వారా త్రివిధ దళాలపై పూర్తి ఆధిపత్యాన్ని చట్టబద్ధంగా చలాయించే అపరిమిత అధికారాలు మునీర్ కు లభించాయి.
దేశ భూభాగాన్ని పరిరక్షించే ఆర్మీకే పరిమితం కాకుండా, మొత్తం పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను శాసించే అత్యున్నత కేంద్రంగా అవతరించారాయన. పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించిన డిఫెన్స్ ఫోర్సెస్ యాక్ట్, నేషనల్ కమాండ్ అథారిటీ సవరణ చట్టం ద్వారా జనరల్ అసిమ్ మునీర్ చేతికి ఈ శాసన అధికారాలు లభించాయి. గత ఏడాది పాకిస్తాన్ లో తీసుకొచ్చిన 27వ రాజ్యాంగ సవరణ ఫలితంగా కొత్తగా ఏర్పాటైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవిలో కూడా మునీర్ కొనసాగుతున్నారు.

దీంతో ఏకకాలంలో ఆయన సర్వసైన్యాధ్యక్షుడిగా కొనసాగుతూనే మొత్తం రక్షణ శాఖను నియంత్రించే సీడీఎఫ్ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తారు. అసిమ్ మునీర్‌కు రక్షణ దళాల్లోని కీలక నియామకాలు, పదవీ విరమణలపై కూడా సంపూర్ణ నియంత్రణ లభించినట్టయింది. మిలిటరీలో ఏ స్థాయి అధికారిని అయినా సర్వీసు నుంచి నిర్బంధంగా తొలగించడం, ప్రమోషన్లు ఇవ్వడం, పదవీ కాలాన్ని పొడిగించే అల్టిమేట్ పవర్స్ ఇప్పుడు ఆయన పరిధిలోకి వచ్చాయి.
సైన్యంలోని ఏ విభాగంలోనైనా పదవీ విరమణ వయోపరిమితిని సవరించే హక్కును కూడా ఈ నూతన చట్టం అసీమ్ మునీర్ కు కల్పించింది. మొన్నటివరకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు స్థానిక ఆర్మీ కార్యకలాపాలపై మాత్రమే పర్యవేక్షణ ఉండేది. తాజా విధివిధానాల ప్రకారం నేవీ, ఎయిర్ ఫోర్స్ ను కూడా సీడీఎఫ్ హోదాలో మునీర్ నేరుగా పర్యవేక్షిస్తారు. వీటికి తోడు అణు కార్యక్రమాలకు సంబంధించి కీలకమైన నేషనల్ కమాండ్ అథారిటీలో కూడా అత్యున్నత సైనిక సలహాదారుగా మునీర్ కు చోటు లభించింది.
27వ రాజ్యాంగ సవరణ ద్వారా పాక్ మిలిటరీ అంతర్గత నిర్మాణంలో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ప్రక్షాళన చోటు చేసుకుంది. ఆ దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుండి కొనసాగుతూ వస్తోన్న చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అనే హోదా పూర్తిగా రద్దయింది. దాని స్థానంలో సీడీఎఫ్, నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ ను ప్రవేశపెట్టారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆర్మీ చీఫ్ పదవిలో ఉన్నవారే సీడీఎఫ్‌గా కూడా కొనసాగేలా చట్టాన్ని సవరించింది పాకిస్తాన్ పార్లమెంట్.
ఈ బిల్లుల ఆమోదం రాజకీయంగా వివాదాలకు దారి తీసింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ దీనిపై మొదట అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అజెండాలో పెట్టకుండా నేరుగా వాటిని సభ సమక్షానికి తీసుకురావడాన్ని తప్పుపట్టారు. ఆ తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గిందా పార్టీ. బిల్లుకు అనుకూలంగానే ఓటు వేశారు. విపక్ష సభ్యులు మాత్రం తమ నిరసనలు వ్యక్తపరిచాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి.
పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో చోటుచేసుకున్న ఈ మార్పులు భారత్‌కు సరికొత్త వ్యూహాత్మక సవాల్ గా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. సైనిక నిర్ణయాధికారాలన్నీ డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ కే కేంద్రీకృతం కావడం వల్ల సరిహద్దు వ్యూహాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఒకే అధికారి చేతిలో ఉండటం వల్ల ఆయన నియంత తరహా నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు.















Click it and Unblock the Notifications