హైదరాబాద్‌లో ప్రాణాంతక ఫేస్ క్రీమ్‌లు స్వాధీనం.. టాస్క్ ఫోర్స్ దాడుల్లో షాకింగ్ విషయాలు!
మన షాప్స్ లో ఉన్న ఫేస్ క్రీములన్నీ మంచివే అని భావిస్తున్నారా? ముఖం అందంగా కనిపించటం కోసం , త్వరగా వైటనింగ్ కావాలని ఎవరు ఏది చెప్తే అది నమ్మి ఆ ఫేస్ క్రీమ్ లను కొనుగోలు చేస్తున్నారా? అయితే ఆగండి.. ఈ విషయం తెలిస్తే మీరు ఫేస్ క్రీముల విషయంలో చేస్తున్న తప్పులు మీకే అర్ధం అవుతాయి. మనం ఎలాంటి డేంజరస్ క్రీమ్స్ వాడుతున్నామో తెలుస్తుంది.
హైదరాబాద్‌లో లైసెన్స్ లేకుండా నడుస్తున్న కాస్మెటిక్స్, మెడికల్ స్టోర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ముర్గీ మార్కెట్ సమీపంలోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, ప్రాణాంతక ఫేస్ క్రీమ్‌లను భారీగా స్వాధీనం చేసుకున్నారు.డీసీపీ కె.ఎస్. రావు ఆధ్వర్యంలో రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ టాస్క్‌ఫోర్స్ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.

పాకిస్థాన్, ఇతర విదేశాల నుంచి అక్రమంగా తెప్పించిన స్కిన్ వైటెనింగ్ క్రీమ్‌లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే లైసెన్స్ లేకుండా అక్రమంగా నడుస్తున్న స్టోర్లను ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మూసివేశారు. బ్యూటీ క్వీన్, బ్యూటీ లేడీస్ ఎంపోరియం, ఎస్‌జే మెడికల్ స్టోర్ వంటి దుకాణాల నుంచి భారీగా అక్రమ క్రీమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రీమ్‌ల్లో ప్రమాదకర రసాయనాలు, మెర్క్యురీ లాంటి పదార్థాలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
వీటిని వాడితే చర్మ వ్యాధులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లోని చర్మవైద్యులు కూడా ఇలాంటి 'ఇన్‌స్టంట్ గ్లో' క్రీమ్‌లపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో, స్థానిక మార్కెట్లలో అమ్ముతున్న ఈ క్రీమ్‌ల వల్ల మంట, మొటిమలు, చర్మం నల్లబడటం, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. పోలీసులు ఈ స్టోర్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ స్టోర్స్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. నగరంలో ఇలాంటి అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు గుర్తింపు లేని బ్రాండ్లు, లైసెన్స్ లేని దుకాణాల నుంచి క్రీమ్‌లు కొనకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. అందం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.













Click it and Unblock the Notifications
