12th PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- కొత్త పీఆర్సీ కమిషనర్..! రిపోర్ట్ కు డెడ్ లైన్..!
ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లు గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ కమిషన్ (12th PRC) విషయంలో తొలి అడుగు పడింది. ఈ మేరకు పీఆర్సీ కొత్త కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం (AP Govt) ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నేతృత్వంలో 12వ పీఆర్సీ కమిషన్ పనిచేయనుంది. ఈ కమిషన్ రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్ల పెంపుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది. దీని ఆధారంగా వేతనాలు, పెన్షన్లు పెరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ వేతన సవరణ కమిషన్‌కు కొత్త కమిషనర్‌ను నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ (IAS 1983 బ్యాచ్)ను పీఆర్సీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ జీవోఎంఎంస్ నంబర్ 200ను ఇవాళ జారీ చేసింది. గతంలో 12వ పే రివిజన్ కమిషన్ కమిషనర్‌గా నియమితులైన డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. దీంతో పీఆర్సీ కమిషనర్ ఖాళీని భర్తీ చేస్తూ రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్‌ను 12వ వేతన సవరణ సంఘానికి కమిషనర్‌గా నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన నియామకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు తెలిపింది.

12వ పీఆర్సీ ఇప్పటికే జారీ చేసిన నిబంధనల ప్రకారమే ఇది కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులు, సంబంధిత వర్గాల నుంచి వినతులు స్వీకరించడం, సమాచారాన్ని కోరడం, అవసరమైన వివరాలను పరిశీలించడం వంటి అంశాలపై కమిషన్ తన సొంత విధానాన్ని రూపొందించుకోవచ్చు. సంబంధిత ప్రభుత్వ శాఖలు, శాఖాధిపతులు అవసరమైన సమాచారం, సహకారం అందించాల్సి ఉంటుంది. పీఆర్సీ సాధారణంగా అమరావతిలోని వెలగపూడి సచివాలయం నుంచి పనిచేస్తుందని, అవసరాన్ని బట్టి రాష్ట్రంలో లేదా రాష్ట్రం వెలుపల పర్యటించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దినేష్ కుమార్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఒక ఏడాదిలోగా ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు.














Click it and Unblock the Notifications
